Share News

రిజర్వేషన్లపైనే రాజకీయ భవిష్యత్తు

ABN , Publish Date - Jul 02 , 2025 | 11:27 PM

పాలమూరు కార్పొరేషన్‌లో ఆశావహులు ఇప్పటి నుంచే డివిజన్లలో పర్యటిస్తున్నారు.

రిజర్వేషన్లపైనే రాజకీయ భవిష్యత్తు

- పాలమూరు నగరపాలికలో అందరిచూపు వాటిపైనే

- ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారుతున్న రాజకీయ సమీకరణలు

- అధికార పార్టీలో చేరనున్న బీఆర్‌ఎస్‌ మాజీలు

మహబూబ్‌నగర్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పాలమూరు కార్పొరేషన్‌లో ఆశావహులు ఇప్పటి నుంచే డివిజన్లలో పర్యటిస్తున్నారు. కార్పొరేషన్‌లో ఇదివరకు ఉన్న 49 వార్డులు కాస్త 60 డివిజన్‌లుగా మారాయి. వాటి విభజన ప్రక్రియ పూర్తయి, తుది జాబితా వెలువడటంతో పోటీలో చేయాలనుకుంటున్న వారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి? డివిజన్‌లో ఉన్న అనుకూల పరిస్థితులు ఏంటి? అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా డివిజన్‌ రిజర్వేషన్‌పైనే రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో అదే వారిని టెన్షన్‌ పెట్టిస్తోంది.

రిజర్వేషన్లు ఇలా..

60 వార్డులున్న కార్పొరేషన్‌లో 50 శాతం అంటే 30 స్థానాలు మహిళలకు రిజర్‌ ్వ కానున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు ఖరారైన చోట భార్యలు, లేదంటే తల్లులను బరిలో దించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అదేవిధంగా మేయర్‌ పీఠం కోసం చాలామందే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మేయర్‌ రిజర్వేషన్‌పైనా అందరిలో ఉత్కంఠ నెలకొంది. మునిసిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఇప్పట్లో రిజర్వేషన్‌ ప్రక్రియ చేపట్టే అవకాశం లేదు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మరో 3-4 నెలల తరువాతే మునిసిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డివిజన్‌లలో మొదలైన క్యాంపెయిన్‌

ప్రస్తుతం డివిజన్‌ల ప్రక్రియ పూర్తవడంతో అశావహులు అవగాహనకు వచ్చినందున ఆయా డివిజన్‌ల ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజా మాజీలతో పాటు కొత్తతరం నాయకులు ప్రజలను పలుకరిస్తూ, అవసరాలు, సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. డివిజన్‌ల ముఖ్యులతో వాట్సప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసి, వీధిలైట్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ తీగల సమస్యలు ఉంటే గ్రూప్‌లో తెలియజేయాలని కోరుతున్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకు ఫోన్‌లు ఎత్తని నాయకులు కూడా ఇప్పుడు డివిజన్‌ ప్రజలు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు. చాలామంది ఇప్పటికే కాలనీలలో ఎన్నికల క్యాంపెయిన్‌ మొదలుపెట్టారు.

మారనున్న రాజకీయ సమీకరణలు

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, తొందరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో పాలమూరు కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పార్టీలో టికెట్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. టికెట్‌ ఖాయమని భరోసా ఇస్తే పార్టీ ఫిరాయింపులకు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎ్‌సకు చెందిన కొందరు తాజామాజీలు, మాజీ కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్‌ గ్యారెంటీతో పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదంటే ఐదుగురు మాజీలు ఈనెలలోనే అధికార పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు తాజామాజీలు కాగా మరో ఇద్దరు గత కౌన్సిల్‌లో కౌన్సిలర్లుగా ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు. వీరంతా సీనియర్‌ నాయకులే కావడం గమనార్హం. ఇప్పటికే వీరంతా అధికార పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీలు మునిసిపల్‌ చైర్మన్‌ అవిశ్వాస తీర్మాన సమయంలో పెద్ద ఎత్తున అధికార పార్టీలో చేరారు. కాంగ్రె్‌సలోనే చాలామంది ఆయా డివిజన్‌లలో పోటీలో ఉండగా, కొత్తవారి రాకను ఇప్పటికే వ్యతిరేకిస్తున్న క్రమంలో టికెట్ల సర్దుబాటు అధికారపార్టీకి తలనొప్పిగా మారనుంది.

Updated Date - Jul 02 , 2025 | 11:28 PM