జై తెలంగాణ అనని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడు
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:55 PM
తెలంగాణ ప్రాంత పేద ప్రజల విముక్తి కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి, ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
- కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే సాయిచంద్‌కు నిజమైన నివాళి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
- అమరచింతలో సాయిచంద్ విగ్రహావిష్కరణ
అమరచింత/ఆత్మకూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రాంత పేద ప్రజల విముక్తి కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి, ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. వనపర్తి జిల్లా, అమర చింతలో ఆదివారం రాత్రి జరిగిన ‘సాయిచంద్ యాదిలో’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సాయిచంద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి రజిని కంటతడి పెట్టుకున్నారు. దీంతో మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆమెను ఓదార్చారు. అనంతరం నిర్వహించిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ రోజు సాయిచంద్ ఉండి ఉంటే నై తెలంగాణ అనే వ్యక్తి సీఎం అయ్యాడని బాధ పడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడం, బీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే సాయిచంద్‌కు నిజమైన నివాళి అన్నారు. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాటకు లెక్కలేనన్ని సార్లు తను స్వయానా రాష్ట్ర ప్రజలు సైతం కంట తడి పెట్టారని ఆయన గుర్తు చేశారు. సాయిచంద్ ఆశయాలను ఆయన భార్య రజిని కొనసాగిస్తానని ముందుకు రావడం గర్వంగా ఉందని తెలిపారు. సాయిచంద్ లేని లోటు తీరనిదని, ఆయన విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా బాధాకరమని అన్నారు.
మళ్లీ ఆంధ్రుల పరోక్ష పెత్తనం
తెలంగాణ రాష్ట్రంలో పరోక్షంగా మళ్లీ ఆంధ్రుల పెత్తనం ప్రారంభమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఈ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రవారు గర్వంగా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలించేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. సాయిచంద్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దుర్మార్గ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడటానికి సాయిచంద్ పాట ఉంటే బాగుండేదని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎస్సార్ రెడ్డి సభలో మాట్లాడుతూ... సాయిచంద్ లేనిదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సభలు పెట్టేవారు కాదు.. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా మెట్టపల్లి సురేందర్ గానం
సభలో ఉద్యమ గాయకుడు మెట్టపల్లి సురేందర్ తాను రాసిన ‘పాలమూరు పిల్లవాడు బయలుదేరెనే/ ప్రపంచ వేదికపై అమరచింత పిల్లవాడు ఎల్లలు దాటెనో’ పాటను పాడి వినిపించారు. ఆ తరువాత సాయిచంద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టిన ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ అనే పాట కూడా పాడి సభికులను ఉత్సాహపరిచాడు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎస్‌ఆర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్‌లు ఎర్రొళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్, విశాఖ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.