అన్నం పెట్టినోళ్లకు సున్నంపెట్టిన సన్నాసి
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:40 PM
కరీంనగర్‌లో ప్రజలు తిరస్కరిస్తే పాలమూరు జిల్లాలోకి వచ్చి ప్రాధేయపడి, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన సన్నాసి అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
పాలమూరు జిల్లా ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
కేసీఆర్‌పై ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పాలమూరు ప్రాజెక్టుల వెనుకబాటుతనానికి కేసీఆర్ కుటుంబ సభ్యులే ముఖ్యులని విమర్శ
నాగర్‌కర్నూల్ జటప్రోల్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నాగర్‌కర్నూల్/కొల్లాపూర్/పెంట్లవెల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : కరీంనగర్‌లో ప్రజలు తిరస్కరిస్తే పాలమూరు జిల్లాలోకి వచ్చి ప్రాధేయపడి, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన సన్నాసి అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రా నాయకులతో కుమ్మక్కై పాలమూరు జిల్లా ప్రజానీకం, రైతాంగానికి తీవ్ర ద్రోహం చేసిన కేసీఆర్ కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోల్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు, నిధులు, ఉద్యోగాల పేరిట పదేళ్లు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నడిగడ్డకు అన్యాయం జరిగితే ఆర్డీఎస్ దగ్గర కుర్చీ వేసుకుని జిల్లాకు ప్రయోజనం చేకూరుస్తానన్న ఆయన.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రశ్నించారు. నారా చంద్ర బాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపనకు నోచుకుని, పనులు ప్రారంభమైన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేక పోయారని అడిగారు. ఎన్నికల సమయంలో కాల్వలు, పాటు కాల్వలు, కనీ సం రిజర్వాయర్ల నిర్మాణం కూడా పూర్తి చేయకుండా నే ఓట్ల ప్రయోజనాల కోసం కక్కుర్తి పడినందుకే కేసీఆర్‌ను జనం ఫామ్‌హౌజ్‌లో పడుకోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణతో సహా ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులను కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. రైతాంగం ప్రయోజనాల కో సం కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తుంటే.. కాంట్రాక్టర్ల సొంత ప్ర యోజనాల కోసం పరిశ్రమించినందుకు కేసీఆర్ కు టుంబ సభ్యులను జనం చెదరగొట్టారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ సీఎంతో సాధ్యమైంది
30 సంవత్సరాలుగా కలగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశం ప్రజాపాలనలో సీఎం రేవంత్‌రెడ్డితో సాధ్యమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ ఉప కులాలకు సామాజిక న్యా యం చేకూరిందన్నారు. ముఖ్యమంత్రి సభలో దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... ప్రస్తుతం సమాజం ఎలా ఉండాలి... సమాజంలో సగం జనాభా ఉన్న మ హిళలు ఆర్ధికంగా ఎలా ఎదగాలి, వారికి ఆర్ధిక స్వావలంబన, ఆర్ధిక సాధికారత, పేదలకు విద్య ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. అలాగే రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సమీకృత గురుకుల పాఠశాల ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మం త్రి తెలిపారు.
కొల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేను: మంత్రి జూపల్లి
తాను ఏం చేసినా కొల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనని, తనను ఆశీర్వదించి మంత్రిని చేసిన ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించాలని, నిరుపేదలకు, నిర్వాసిత కుటుంబాలకు కేటాయించేందుకు అదనంగా 3 వేల ఇందిరమ్మ ఇళ్లు, కొల్లాపూర్ మునిసిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్ల నిధులు, నియోజకవర్గంలో ఉన్న ప్రతీ గ్రామ పంచాయతీకి అదనంగా రూ.15 లక్షలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరగుతున్న ప్రజా పాలనను విమర్శించే స్థాయి లేదన్నారు. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పాస్ చేయించాలని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభించారని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 2,500 మంది పేద విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో చదువుకునేందుకు రూ.200 కోట్లు కేటాయించి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సమీకృత గురుకుల పాఠశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు 98 జీవో ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని, పెంట్లవెల్లి మండల సింగిల్‌విండో సొసైటీ పరిధిలో ఉన్న 499 మందికి రైతు రుణమాఫీ జరిగేలా చూడాలని, కొల్లాపూర్ మండల పరిధిలోని అసద్‌పూర్ శివారులో ఉన్న 1,600 ఎకరాల భూములను ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్శించేలా వినియోగించుకోవాలని కోరారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. రేవంత్‌రెడ్డి ఘనతే
చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దక్కిందని రాష్ట్ర పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. జటప్రోలు బహిరంగ సభ లో మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుత ముఖ్యమంత్రి చే సిన ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రికి ప్రతీ ఒక్కరు ధన్యవాదాలు తెలపాలన్నారు. అప్పట్లో వరి వేస్తే ఉరి అనే పరిస్థితి నుంచి ప్రస్తుతం సన్న బియ్యం వేస్తే సరైన గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి దానిని అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కోటి దండాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. జ టప్రోలు బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ... ఈ రోజు ఈ సమావేశాన్ని చూస్తే ప్రజలందరికీ కూడా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి వస్తున్నారని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలను ప్రారంభిస్తున్నారని ఆనందంగా వచ్చారన్నారు. ప్రస్తుతం నిర్మించిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని 25 ఎకరాల్లో నిర్మించారని, అందులో 2500 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి , కారల్ మార్క్స్ తదితరులను గుర్తు చేసుకున్నారు.