Share News

దేవ్‌సింగ్‌ గీసిన గీత... మారని వ్యాపారుల తలరాత!

ABN , Publish Date - Jul 25 , 2025 | 10:50 PM

బ్రహ్మ రాసిన నుదిటి రాతను మార్చడం ఎవరితరం కాదంటారు. పాలమూరు కార్పొరేషన్‌ పరిధిలో నాటి కమిషనర్‌ దేవ్‌సింగ్‌ గీసిన గీతను మార్చడం కూడా ఎవరి వల్లా కావడం లేదు. అందుకోసం వ్యాపారులు ఎనిమిదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బుట్టదాఖలవుతున్నాయి.

దేవ్‌సింగ్‌ గీసిన గీత... మారని వ్యాపారుల తలరాత!
గడియారం చౌరస్తాలో మూసి ఉన్న అద్దె దుకాణాలు

పాలమూరులో ఎనిమిదేళ్ల క్రితం అద్దె దుకాణాలకు బహిరంగ వేలం

బకాయిలు రూ.కోట్లల్లో పేరుకుపోవడంతో కార్పొరేషన్‌ కొరడా

ఎన్ని పైరవీలు చేసినా మారని వేలం అద్దె

రెండు రోజుల్లో 72 దుకాణాలకు తాళం..

మరో 100 దుకాణాలను సీజ్‌ చేస్తామంటున్న యంత్రాంగం

మహబూబ్‌నగర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మ రాసిన నుదిటి రాతను మార్చడం ఎవరితరం కాదంటారు. పాలమూరు కార్పొరేషన్‌ పరిధిలో నాటి కమిషనర్‌ దేవ్‌సింగ్‌ గీసిన గీతను మార్చడం కూడా ఎవరి వల్లా కావడం లేదు. అందుకోసం వ్యాపారులు ఎనిమిదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. చివరకు తమ దుకాణాలకు తాళాలు వేసే పరిస్థితి ఏర్పడింది. పాలమూరు మునిసిపాలిటీగా ఉన్నప్పుడు 2017 జూలై 17న లీజు కాలం పూర్తయిన 53 అద్దె దుకాణాలకు అప్పటి కమిషనర్‌ దేవ్‌సింగ్‌ బహిరంగ వేలం పాట నిర్వహించారు. అప్పటిదాకా దుకాణాలకు నెలకు అద్దె రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఉండేది. అందుకు వ్యాపారులు బహిరంగ వేలం కాకుండా అద్దె రెండింతలు చేసి, తమకే దుకాణాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఒప్పుకోని కమిషనర్‌ ముందు వేలంపాటలో పాల్గొనండి, తరువాత చూద్దాంలే అన్నారు. దీంతో సిట్టింగ్‌ వ్యాపారులు ఎలాగైనా తిరిగి దుకాణాలను దక్కించుకోవాలని పోటీపడి వేలంపాట పాడారు. రూ.50 వేల నుంచి రూ. 1.55 లక్షల వరకు వేలం పాడి, దుకాణాలను తిరిగి సొంతం చేసుకున్నారు. అప్పటినుంచి వ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా రూ.5 వేల నుంచి రూ.8 వేలు అద్దె చెల్లిస్తున్న వారు ఉన్నట్టుండి నెలకు ఒక్కో దుకాణానికి రూ.50 వేలు, రూ.70 వేలు, రూ.లక్ష, రూ.లక్షా 50 వేలు చెల్లించాలంటే తలకుమించిన భారంగా మారింది. దాంతో అద్దెలు చెల్లించడం మానేశారు. వీరిని చూసి నగరంలోని మిగతా వ్యాపారులు కూడా అద్దె చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. నగరంలో 258 అద్దె దుకాణాలు ఉండగా, అందులో 70 దుకాణాలు పని చేయడం లేదు. మిగతా 188 దుకాణాలు నడుస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు రూ.11.50 కోట్ల బకాయి పేరుకుపోయింది.

ఎనిమిదేళ్లుగా కలవని నాయకుడు లేడు

దుకాణాల అద్దె భారం అవుతుండటం, నెలనెలా బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతుండటంతో వ్యాపారులు ఎనిమిదేళ్లుగా కలవని నాయకుడు లేరు. గత ప్రభుత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్‌ను పలుమార్లు కలిసి విన్నవించారు. అందుకు ఆయన వేలంపాటకన్నా ముందు చెల్లిస్తున్న అద్దెపై 300 శాతం ఎక్కువ చెల్లిస్తారని నోటిమాటగా చెప్పారు. అప్పటినుంచి అదే పద్ధతిన అద్దె వసూలు చేస్తున్నారు. అయితే 300 శాతం పోనూ, వేలం పాట ప్రకారం మిగతా డబ్బును వారి దుకాణాలపై బకాయిగా రికార్డుల్లో చూపుతున్నారు.

ప్రభుత్వం మారడంతో..

2024 డిసెంబరులో ప్రభుత్వం మారడంతో వ్యాపారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అద్దె దుకాణాల బకాయిలు రూ.16 కోట్లకు పేరుకుపోవడంతో వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో అధికారులు నోటీసులు జారీ చేసి 3 నెలలక్రితం పలు దుకాణాలను సీజ్‌ చేశారు. దీంతో వ్యాపారులు మళ్లీ నాయకుల వద్దకు పరుగులు తీశారు. మొత్తం బకాయిలో 5 శాతం చెల్లించాలని నాయకుల ద్వారా చెప్పించుకున్నారు. 5 శాతం చెల్లింపులు చేసిన వారం తరువాత దుకాణాలను తెరిపించుకున్నారు. ఇప్పటివరకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. మరో రూ.11.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా వసూలు చేయాలని యంత్రాంగం మరోసారి కొరడా ఝళిపిస్తోంది. గురువారం గడియారం చౌరస్తాలో 32 దుకాణాలను సీజ్‌ చేసిన కార్పొరేషన్‌ అధికారులు, శుక్రవారం మరో 40 దుకాణాలను సీజ్‌ చేయడంతో సీజ్‌ చేసిన దుకాణాల సంఖ్య 72కు చేరింది. రెండ్రోజుల్లో మిగతా 100 దుకాణాలకు కూడా తాళాలు వేయాలని యంత్రాంగం నిర్ణయించింది.

మూడు దుకాణాల అద్దె రూ.కోటి

గడియారం చౌరస్తాలో కేవలం 3 దుకాణాల అద్దె రూ.కోటి వరకు బకాయి ఉండటం గమనార్హం. బకాయిలు వందశాతం చెల్లిస్తేనే దుకాణాలను ఓపెన్‌ చేస్తామని అధికారులు తెగేసి చెబుతుండటంతో కొందరు డీడీలు చెల్లిస్తుండగా, మరికొందరు మాత్రం మళ్లీ నాయకుల వద్దకు వెళ్లి పైరవీలు చేయాలనుకుంటున్నారు. ఎన్ని రోజులైనా బకాయిలు మాత్రం చెల్లించక తప్పదని అధికారులు చెబుతున్నారు. మరి పెద్ద మొత్తంలో అద్దె బకాయి ఉన్న వ్యాపారులు బకాయి చెల్లిస్తారా? లేదంటే దుకాణాలను ఖాళీ చేసి కార్పొరేషన్‌కు అప్పగిస్తారా అన్నది చూడాలి.

Updated Date - Jul 25 , 2025 | 10:50 PM