Share News

దీపం జ్యోతి పరబ్రహ్మ

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:34 PM

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉమామహేశ్వరం, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

దీపం జ్యోతి పరబ్రహ్మ
అలంపూర్‌ ఆలయ ఆవరణలో దీపాలను వెలిగిస్తున్న మహిళలుa

- కార్తీక మాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు

- భక్తులతో కిటకిటలాడిన ఉమామహేశ్వరం

- అలంపూర్‌ ఆలయ ప్రాంగణంలో దీపారాధన

అచ్చంపేట/అలంపూర్‌, నవంబరు 17:(ఆంధ్రజ్యోతి) : కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉమామహేశ్వరం, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామునే ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలను వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఉమామహేశ్వరంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కొండ దిగువన భోగ ఉమామహేశ్వరంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. భక్తులను ఆలయం వద్దకు తీసుకెళ్లేందుకు 3 మినీ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర స్వామికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనకు పాలక మండలి ,చైర్మన్‌ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాస్‌ రావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పాపనాశిని గుండంలో ఆయన పుణ్యస్నానం చేసి, ఈశ్వరుడికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. గణపతి, అయ్యప్ప స్వాములకు పూజలు చేశారు. అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక నిధులతో క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయానికి వెళ్లే దారిలో చెక్‌పోస్టును ఎత్తివేయాలని భక్తులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఫ అలంపూర్‌ క్షేత్రం, ఐదవ శక్తి పీఠం జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల కద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. క్షేత్రానికి వచ్చిన భక్తులు మందుగా తుంగభద్ర పుష్కరఘాట్‌ వద్ద పుణ్యస్నానాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదిలారు. స్వామి, అమ్మవారి ఆలయాల ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో కుటుంబ సమేతంగా వన భోజనాలు చేశారు.

Updated Date - Nov 17 , 2025 | 11:34 PM