ఆధునికీకరణ మీదున్న ఆసక్తి ఆస్పత్రి మీద లేకపాయే..
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:17 PM
మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దవాఖాన అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై కాకుండా ఆధునికీకరణపై దృష్టి పెట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ.1.50 లక్షలతో తన చాంబర్‌ను ఆధునీకరింపజేసుకున్నారు.
రూ.1.50 లక్షలతో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్‌కు హంగులు
నిధులపై నోరు విప్పని అధికారులు
సూపరింటెండెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం)సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దవాఖాన అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై కాకుండా ఆధునికీకరణపై దృష్టి పెట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ.1.50 లక్షలతో తన చాంబర్‌ను ఆధునీకరింపజేసుకున్నారు. గత కొన్నేళ్లుగా దాదాపు 5 గురు సూపరింటెండెంట్ల వరకు అదే చాంబర్‌లో ఉన్నారు. కానీ ఇటీవల కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్‌కు ఆ చాంబర్ నచ్చకపోవడంతో ఫాల్ సీలింగ్, గోడలకు లప్పం పెయింటింగ్, వెలుగులు విరజిమ్మే లైటింగ్, ఏసీ, టీవీ, డోర్ కర్టన్లు, ఫ్లోర్ మ్యాట్ కొత్తవి ఏర్పాటు చేయించారు. ఈ పనులన్నీ సూపరింటెండెంట్ సీసీ చేయించడం విశేషం.
ఆ నిధులెక్కడివి
ఆధునికీకరణ పనులు చేయడానికి రూ.1.50 లక్షల నిధులు ఎక్కడి నుంచి వినియోగించారో ఎవరూ చెప్పడం లేదు. ఆస్పత్రి పరిపాలన విభాగం ఏడీని అడుగగా తమకు తెలియదని, అన్ని నిధులు ఆస్పత్రిలో లేవని అంటున్నారు. సూపరింటెండెంట్‌ను అడిగితే డాక్టర్లు సహాయం చేశారని, తమ వైద్యుల సంఘం నుంచి తెప్పించుకున్నామని చెబుతున్నారు. అయితే డాక్టర్లు మాత్రం తాము ఏ సహాయం చేయలేదని, అవే నిధులు మాకు ఇస్తే మా విభాగాలలో చాలా పరికరాలను మరమ్మతులు చేయించుకుంటామని చెబుతున్నారు. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి ఖర్చు చేశారో అంతుచిక్కడం లేదు.
ఎన్నో మరమ్మతులు చేసే అవకాశం
ఆస్పత్రిలో ఈసీడీ యంత్రాలు, మానిటర్లు, బీపీ ఆపరేటర్లు, ఇతర వైద్య పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. వాటిని మరమ్మతు చేయడానికి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని ఇదివరకే కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఆధునికీకరణ కోసం వినియోగించిన నిధులను వాటి మరమ్మతులకు వినియోగిస్తే ఎంతో మంది రోగులకు మేలు జరిగేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
ఆధునికీకరణ అవసరమా?
గతంలో ఉన్న సూపరింటెండెంట్‌లలో డాక్టర్ రాంకిషన్ ఆర్థిక సహాయాలు తెచ్చి ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. ఇటీవల బదిలీపై వెళ్లిన డాక్టర్ సంపత్‌కుమార్ రూ.36 లక్షల విలువైన ఈఎన్‌టీ పరికరాలను ఆస్పత్రికి ఉచితంగా అందజేశారు. ఆ పరికరాలతో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేస్తుండటంతో ఆస్పతికి ఆరోగ్యశ్రీ నిధులు జమ అయ్యాయి. కానీ డాక్టర్లతో ఆర్థిక సహాయాలు తీసుకొని చాంబర్‌ను ఆధునికీకరించుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రస్తుత సూపరింటెండెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.