చిన్నారులకు చిరునవ్వుల వరం
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:13 PM
వెట్టి చాకిరీలో బాల్యం బందీ అవుతోంది. తల్లిదండ్రుల పేదరికం, చదువుపై వారికి సరైన అవగాహన లేకపోవడం..
- వెట్టి నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం
- తనిఖీల కోసం ప్రత్యేక అధికారుల బృందాలు
- నేటి నుంచి ‘ఆపరేషన్ ముస్కాన్’ ప్రారంభం
నారాయణపేట, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : వెట్టి చాకిరీలో బాల్యం బందీ అవుతోంది. తల్లిదండ్రుల పేదరికం, చదువుపై వారికి సరైన అవగాహన లేకపోవడం.. కారణమేదైనా కావచ్చు కానీ పుస్తకాలు పట్టుకొని బడికెళ్లాల్సిన చిన్నారులు హోటళ్లు, ఇటుకల బట్టీలు, పరిశ్రమలు, మెకానిక్, కిరాణం దుకాణాల్లో బాలకార్మికులుగా మారుతున్నారు. వారికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జూలైలో ‘ఆపరేషన్ ముస్కాన్’, జనవరిలో ‘ఆపరేషన్ స్మైల్’ పేరిట ప్రతీ సంవత్సరం రెండు సార్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈనెల 1 నుంచి 11వ ‘అపరేషన్ మస్కాన్’కు శ్రీకారం చుట్టింది. నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
ప్రభుత్వం అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు జిల్లా వ్యాప్తంగా పర్యటించి అకస్మిక దాడులు నిర్వహించనున్నది. ఇప్పటికే నారాయణపేట జిల్లా కలెక్టరెట్‌లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆధ్వర్యంలో డీఎస్పీ లింగయ్య పోలీసు, బాలల సంరక్షణ, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్‌పై దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నుంచి ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించనున్నాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్‌పీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో బడి బయట కార్మికులను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే చిన్నారులను యాచక వృత్తికి పంపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాలకార్మిక వ్యవస్దను రూపుమాపుదాం 2ఎన్‌పిటి30:
బాలకార్మిక వ్యవస్దను రూపు మాపేందుకు ప్రజలందరూ అందరూ సహకరించాలి. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్‌స్మైల్ కార్యక్రమాలు నిర్వహించి అరేళ్లలో 1,078 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించాం. ఎక్కడైనా బాల కార్మికులను పనుల్లో పెట్టుకుంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా 100 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. అధికారులు దాడులు నిర్వహించి బాలకార్మికులకు విముక్తి కల్పిస్తారు. యజమానులపై కేసులు నమోదు చేస్తారు.
- యోగేష్ గౌతమ్, ఎస్పీ, నారాయణపేట