Share News

అంతు పట్టని గువ్వల వ్యూహం

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:44 PM

అచ్చంపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు అనేక ఆసక్తికర పరిణామాలకు దా రి తీస్తున్నాయి.

అంతు పట్టని గువ్వల వ్యూహం

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు అనేక ఆసక్తికర పరిణామాలకు దా రి తీస్తున్నాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా, బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా కొనసాగిన గువ్వల బాలరాజు అనూహ్యంగా పార్టీ మారడం పట్ల అనేక రాజకీయ విశ్లేషణలు చోటు చేసు కుంటున్నాయి. పార్టీని మారే క్రమంలో కేసీఆర్‌, కేటీఆర్‌లను ఉద్దేశించి గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. మోయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘట నలో తనను పావుగా వాడుకున్నారని, కేసీఆర్‌ పాలమూరు నుంచి ఎంపీగా నిలబడిన క్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి తనకు టికెట్‌ కేటాయించారు. కానీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన గెలుపునకు ఎలాంటి చొరవ చూపకుండా రాజకీయంగా భ్రష్టు పట్టించారని గువ్వల బాలరాజు దుయ్యబట్టడం గమనార్హం.

గువ్వల అసలు వ్యూహమేమిటో?

భారత రాష్ట్ర సమితిలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న గువ్వల బాలరాజు ఆకస్మికంగా ఆ పార్టీని వీడడం అనేక రాజకీయ విశ్లేషణలకు తావిస్తోంది. మరో మూడేళ్ల దాకా అసెంబ్లీ, పార్ల మెంట్‌కు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. రాజకీయం గా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తెలంగాణలో బలమైన క్యాడర్‌ను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో గువ్వల బాలరాజు రెండు పార్టీలను కాదని కమలం గూటికీ చేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోయినాబాద్‌ ఫామ్‌ హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో గువ్వల బాలరాజు బీజేపీని ప్రధాన ముద్దాయిగా పేర్కొన్నా రు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గువ్వల బాలరాజుతోపాటు కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా కీలకంగా కన్పించారు. రాష్ట్రం లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారం కొంతకాలం పాటు వెనక పడింది. కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై భారతీయ జనతా పార్టీలో కీలకంగా సంస్థాగత వ్యవహారాలు చూసే బీఎస్‌.సంతోష్‌ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై అమిత్‌షాతో సహా కేంద్ర నాయకత్వం రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, అఽధ్యక్షులపై సీరియస్‌ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గువ్వల బాలరాజు బీజేపీలో చేరే అంశం మొదలైందని మొత్తం ఘటనలో మిగతా వారందరినీ పార్టీలో చేర్చుకునేందుకు అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అచ్చంపేట బీఆర్‌ఎస్‌ న్‌చార్జ్‌గా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌..?

గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన అచ్చంపేట నియోజకవర్గంలో బలమైన నేతను రంగంలోకి దించే క్రమంలో బీఆర్‌ఎస్‌ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. గువ్వల బాలరాజు పార్టీని వీడనున్నారనే క్రమంలో వచ్చిన వార్తల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను చేపట్టిన బీఆర్‌ఎస్‌ గత నాలుగు రోజుల నుంచి అచ్చంపేటలో ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలందరినీ రంగంలోకి దించింది. నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌ గువ్వల బాలరాజు వెంట వెళ్లకుండా ఆ పార్టీ నియంత్రించగలిగింది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన అచ్చంపేటకు గువ్వల బాలరాజు పార్టీ వీడిన తర్వాత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను నియమించాలనే అంశంలో ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. అచ్చంపేట నియోజకవర్గంతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు అనుబంధం ఉంది. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తల్లి ప్రేమమ్మ, తండ్రి సవారన్న ప్రభుత్వ టీచర్లుగా అమ్రాబాద్‌ మండలంలో దాదాపు 20 ఏళ్ల పాటు పని చేశారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రాథమిక విద్యాభ్యాసం 5వ తరగతి వరకు వెంకటేశ్వర్లబావిలో, 6 నుంచి 7వ తరగతి వరకు నడింపల్లిలో కొనసాగింది. అచ్చంపేట నియోజకవర్గంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు బలమైన అనుబంధం ఉండడంతో బీఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను అచ్చంపేట ఇన్‌చార్జిగా నియమించాలని దాదాపు నిర్ణయించింది. అధికారికమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

మాజీ మంత్రి రాములుకు నాకు విబేధాలు అంటగట్టారు

బీజేపీలో చేరే క్రమంలో అనేక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మాజీ మంత్రి రాములు, తన మధ్యన కూడా ఆఘాతాన్ని సృష్టించి రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూసిందని ఆరోపణ చేశారు. వాస్తవానికి ఇరువురి మధ్య ఎలాంటి అపోహాలు లేవని, బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న నేతల మధ్య పరస్పర అఘాతం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనే యోచన బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ఉందని గువ్వల బాలరాజు బాహాటంగా పేర్కొన్నారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Updated Date - Aug 10 , 2025 | 11:44 PM