బెడిసికొట్టిన ‘ఏకగ్రీవం’
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:33 PM
నాగర్‌కర్నూల్ జిల్లా, వెల్దండ మండలంలోని రాఘాయిపల్లిలో ఓ అభ్యర్థి ఎదురుతిర గడంతో ఏకగ్రీవ తీర్మానం బెడిసికొట్టింది. మొదటి విడతలో ఎన్నికలు జరుగనున్న ఈ గ్రామపంచాయతీ ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది.
- గ్రామస్థుల తీర్మానానికి అంగీకరించని ఓ అభ్యర్థి
- ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణ
- రాఘాయిపల్లిలో ఆర్డీవో, సీఐ విచారణ
- కేసు నమోదు చేసిన పోలీసులు
వెల్దండ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, వెల్దండ మండలంలోని రాఘాయిపల్లిలో ఓ అభ్యర్థి ఎదురుతిర గడంతో ఏకగ్రీవ తీర్మానం బెడిసికొట్టింది. మొదటి విడతలో ఎన్నికలు జరుగనున్న ఈ గ్రామపంచాయతీ ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని గ్రామస్థు లందరూ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామాభి వృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని సామ వెంకటయ్య అనే అభ్యర్థి ప్రతి పాదించడంతో అందరూ అంగీకరించారు. కానీ బర్కం గణేశ్ అనే అభ్యర్థి మాత్రం దీన్ని వ్యతిరేకించి వెళ్లిపోయాడు. అంతే కాకుండా తాను నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే రూ. 5 లక్షలు ఇస్తామంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, వెల్దండ సీఐ విష్ణువర్దన్‌రెడ్డి, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, ఎంపీవో లక్ష్మణ్ సిబ్బందితో కలిసి మంగళవారం గ్రామానికి చేరుకొని స్థానికులతో సమావేశమ య్యారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, ఎవరైనా బెదిరింపులు, ఒత్తిళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ చిదానందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సామ వెంకటయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.