కనుల పండువగా రథోత్సవం
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:34 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- వేలాదిగా తరలొచ్చిన భక్తులు
- మక్తల్‌లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించి, కోనేరులో స్నానం చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మునిసిపల్ కమిషనర్ శ్రీరాములు కుటుంబ సమేతంగా వెళ్లి, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రథోత్సవం నేపథ్యంలో బుధవారం రాత్రే వ్యవసాయ మార్కెట్, రాఘవేంద్ర, శబరి కాలనీల భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. పిం డి వంటలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శక్తిపీఠం వ్యవస్థాపకులు శాంతనంద పురోహిత్ స్వామివారిని దర్శించుకున్నారు. 3 గంటలకు పల్లకీసేవ, 4 గంటలకు స్వామివారికి మంగళహారతులు నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు ఉత్సవ మూర్తి విగ్రహాన్ని రథం వద్దకు తెచ్చారు. పూజలు చేసి, రథంపై ఉంచారు. అనంతరం అశేష భక్తజనం రథాన్ని లాగారు. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మారుమోగాయి. కర్ణాకట, తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ మహారాష్ట్ర, గుజరాత్, గోవా తదితర రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వాములు, వీహెచ్‌పీ, భజరంగదళ్, ఆర్‌ఎ్‌సఎస్ నాయకులు లైన్‌లలో భక్తులకు సహకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారీ, ఈవో కవిత, సత్యనారాయణ, అర్చకులు అరవింద్, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, భక్తులు పాల్గొన్నారు.