పేట యార్డుకు పోటెత్తిన ధాన్యం
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:31 PM
నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తింది. పరిసర గ్రామాల నుంచి రైతులు శుక్రవారం ఒక్క రోజే మార్కెట్‌కు తొమ్మిది వేల బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చారు.
- ఒకే రోజు పదిహేను వేల బస్తాలు
- నేడు ధాన్యం టెండర్లు రద్దు
- మార్కెట్‌కు ధాన్యం తేవొద్దు
- రైతులకు అధికారుల సూచన
నారాయణపేట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తింది. పరిసర గ్రామాల నుంచి రైతులు శుక్రవారం ఒక్క రోజే మార్కెట్‌కు తొమ్మిది వేల బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చారు. ముందు రోజు గురువారం ఆరు వేల బస్తాల ధాన్యం వచ్చింది. కానీ ఓ హమాలీ మృతి చెందడంతో టెండర్లు వేయకపోవడంతో క్రయ విక్రయాలు జరుగలేదు. దీంతో రెండు రోజుల్లో వచ్చిన మొత్తం 15 వేల ధాన్యం (9 వేల క్వింటాళ్లు) బస్తాలు మార్కెట్లో నిల్వ ఉండిపోయాయి. దీంతో శుక్రవారం ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు, బస్తాలే కనిపించాయి. మధ్యాహ్నం వరకు టెండర్లు, ఆ తర్వాత ధాన్యాన్ని తూకం వేశారు.
హంస రకం 250 క్వింటాళ్లు విక్రయానికి రాగా, క్వింటాలుకు గరిష్ఠం రూ. 1,756, కనిష్ఠం రూ. 1,525 ధర పలికింది. సోనా రకం 4,820 క్వింటాళ్లు విక్రయానికి రాగా, గరిష్ఠం రూ. 2,220, కనిష్ఠం రూ. 1,350 ధర పలికింది. ధాన్యాన్ని శనివారం తరలించాలని మార్కెట్ చైర్మెన్ శివారెడ్డి, కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్ లక్ష్మణ్‌లు ఖరీదుదారులకు సూచించారు. అయితే ఎండలు అధికంగా ఉండటంతో తూకాల సమయంలో హమాలీలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో క్రయవిక్రయాలు అశించిన స్థాయిలో కొనసాగడం లేదు. యార్డులో నిండిపోయిన ధాన్యాన్ని శని, ఆదివారాల్లో పూర్తి స్థాయిలో తరలించేలా ఖరీదుదారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో శనివారం టెండర్ల ప్రక్రియను నిర్వహించడం లేదని, మార్కెట్ యార్డ్‌కు ధాన్యం తీసుకురావొద్దని మార్కెట్ పాలకవర్గం, అధికార యంత్రాంగం రైతులకు సూచించారు. సోమవారం యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.
భయపెడుతున్న అకాల వర్షాలు
కొన్ని రోజులుగా అకాల వర్షాలు అన్నదాతలను భయపెడుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండలు మండుతున్నాయి. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్క సారిగా మేఘావృతమై ఈదురు గాలులతో వర్షం పడుతోంది. దీంతో రైతులు వరి కోతలు పూర్తి కాగానే కల్లాల నుంచే ధాన్యాన్ని నేరుగా మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మరికొందరు రైతులు తమ పొలాల్లోని కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. వాతావరణం మారి వర్ష సూచనలు కనిపించగానే ధాన్యంపై కవర్లు కప్పి కాపాడుకొని ఆరిన తర్వాత మార్కెట్‌కు తీసుకొస్తున్నారు.