Share News

అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:32 PM

అకస్మాత్తుగా వరదలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు.

అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి
అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- వరదలు వస్తే ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి

- ప్రాణ నష్టం సంభవించకుండా జాగ్రత్త వహించాలి

- వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : అకస్మాత్తుగా వరదలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విపత్తు నిర్వహణపై లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వా తావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు, జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు, చిన్నంబావి, కొత్తకోట, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో అధిక వర్షాలతో కృష్ణానది ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా మండలాల్లో లైన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజలు, జంతువులకు ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని సూచిం చారు. వరదలు వస్తే రోడ్డు, వంతెనలు, కాజ్‌వేలపై నుంచి మనుషులు, వాహనాలు దాటే ప్రయత్నంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని, కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిం చారు. 24/7 సిబ్బందిని నియమించడం వంటి ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. వరదలు తగ్గిన తర్వాత ప్రబలే వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ముఖ్య ప్రణాళికాధికారి భూపాల్‌రెడ్డి, మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, విద్యుత్‌ శాఖ డీఈ శ్రీనివాస్‌, కొత్తకోట సీఐ శివకుమార్‌, అగ్నిమాపక శాఖ అధికారులు, తహసీల్దార్లు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:33 PM