Share News

ఖర్చుపై అభ్యర్థుల్లో టెన్షన్‌

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:58 PM

స్థానిక సంస్థల్లో కీలకమైన పంచాయతీ సమరం చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ప్రతిష్టకు పోయి అభ్యర్థులు అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

ఖర్చుపై అభ్యర్థుల్లో టెన్షన్‌

ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు..

మేజర్‌ గ్రామ పంచాయతీల్లో అంతకంటే ఎక్కువే

మద్యం, డబ్బులు పంపిణీ.. వలస ఓటర్లకు ఛార్జీలు కూడా

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో కీలకమైన పంచాయతీ సమరం చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ప్రతిష్టకు పోయి అభ్యర్థులు అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్నికలయ్యాక ఆ డబ్బులు తిరిగి ఎలా చెల్లించాలన్న టెన్షన్‌ వారిలో నెలకొంది. ప్రచారం సోమవారం ముగియడంతో మంగళవారం గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. పట్టణాలు, హైదరాబాద్‌ నుంచి ఓటేయడానికి చాలామంది మంగళవారం రాత్రే గ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు ఎన్నికల జాతరను తలపిస్తున్నాయి.

భారీ పోలీస్‌ బందోబస్తు

ఎన్నికల కేంద్రాల వద్ద పోలీ్‌సశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి, రెండు విడతల్లో జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఘటనలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీ్‌సశాఖ సక్సెస్‌ అయ్యింది. ఎస్పీ జానకి బందోబస్తు పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూడో విడతలో 1,152 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, అందులో 43 గ్రామాలకు చెందిన 385 స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

చివరి రోజు విచ్చలవిడిగా పంపకాలు

గ్రామాల్లో చివరి ప్రయత్నంగా అభ్యర్థులు ఓటర్లకు పెద్ద ఎత్తున మర్యాదలు చేశారు. మంగళవారం రాత్రి ఇంటింటికి మద్యం, నగదు పంపిణీ చేశారు. పంపిణీ విషయంలో ఇరుపార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల మధ్య రాజీ ధోరణి కనిపించింది. ఎవరు ఏం పంపిణీ చేసినా అభ్యంతరాలు, గొడవలకు దిగడం లేదు. వాళ్లు పంపిణీ చేస్తే మనమూ పంపిణీ చేద్దామన్న వైఖరి కనిపించింది. అడ్డుకుంటే అది మనకే నష్టమని నాయకులు, అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రధానంగా వలస ఓటర్లపై నాయకులు దృష్టి పెట్టారు. వారికి ఫోన్‌లో టచ్‌లో ఉంటూ, మర్యాదలకు లోటు కాకుండా చూసుకుంటున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 10:59 PM