Share News

టెంకాయల వేలంలో టెండ‘రింగ్‌’

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:35 PM

: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జములమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన టెంకాయల వేలంలో టెండర్‌దారులు బాహాటంగా రింగ్‌ అయ్యారు.

టెంకాయల వేలంలో  టెండ‘రింగ్‌’
ఆలయ కార్యాలయంలో వేలం పాట నిర్వహిస్తున్న అధికారులు, చైర్మన్‌

- పది శాతం పెంపు నిబంధన ఎత్తివేత

- బాహాటంగా గుడ్‌విల్‌ పాడుకున్న టెండర్‌దారులు

- ఆదాయం కోల్పోయిన జములమ్మ ఆలయం

గద్వాల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లాలోని జములమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన టెంకాయల వేలంలో టెండర్‌దారులు బాహాటంగా రింగ్‌ అయ్యారు. దీంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి బారీగా గండిపడింది. ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ వేంకటేశ్వరమ్మ, ఈవో పురేందర్‌ కుమార్‌, ఆలయ చైర్మన్‌ వెంకట్రాములు సమక్షంలో వేలం నిర్వహించారు. అయితే గత ఏడాది కంటే పది శాతం అధికంగా వేలం పాడితేనే టెండర్‌ను ఖరారు చేయాల్సి ఉంది. ఇది ఎండోమెంట్‌ నిబంధనల్లో ఉంది. గతంలో తక్కువ వచ్చిన సందర్భాల్లో వేలంను వాయిదా వేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ అధికారులు టెండర్‌దారులతో కుమ్మక్కై ఈ నిబంధనను గాలికొదిలేశారు. ఒక్క వేలం పాటలోనే కాకుండా టెంకాయలు, ప్రసాదాలను అధిక ధరలకు విక్రయిస్తున్నా నివారించలేకపోతున్నారు. దీంతో భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

వేలంలో పాల్గొన్న 8 మంది

టెంకాయల విక్రయానికి 8 మంది టెండరుదారులు హాజరయ్యారు. వారిలో వెంకట నర్సింహులు అనే వ్యక్తి రూ. 52.50 లక్షలకు టెండరు దక్కించుకున్నారు. ఇది గత ఏడాది రూ.50.40 లక్షలు కాగా, నిబంధనల ప్రకారం 10 శాతం ఎక్కువగా రావాలంటే, రూ.55 లక్షల కంటే ఎక్కువకు పాడాలి. కానీ అధికారులు తక్కువ మొత్తానికి ఖరారు చేశారు. ఇక ఒక్కో టెండర్‌దారుడికి రూ.25 వేల గుడ్‌విల్‌ను బాహాటంగానే అందించారు. టెంకాయ చిప్పల సేకరణకు 18 మంది టెండర్‌దారులు రాగా తోటరాముడు అనే వ్యక్తి రూ. 12.45లక్షలకు దక్కించుకున్నాడు. గత ఏడాది ఇది రూ.12.22లక్షలు పలికింది. ఇక్కడ 10 శాతం అధికంగా రావాలంటే రూ. 13.65లక్షలు రావాల్సి ఉంది. ఇక్కడ ఒక్కో టెండర్‌ దారుడు రూ.15 వేలు గుడ్‌విల్‌ పొందారు. ఇక లడ్డు వేలం పాటకు ఆరు మంది టెండర్‌దారులు రాగా సురేశ్‌ అనే వ్యక్తి దీనిని రూ. 4,10,800కు దక్కించుకున్నాడు. గత ఏడాది ఇది రూ.4 లక్షలు పలికింది. ఇక్కడ కూడా 10 శాతం అధిక మొత్తం రాలేదు. ఒక్కో టెండర్‌దారుడు రూ.10 వేల గుడ్‌విల్‌ను తీసుకున్నారు. టెండర్‌దారులు బాహాటంగా రింగ్‌ అవుతున్నా అధికారులు నివారించకపోగా, టెండర్‌దారుల వత్తిడికి లొంగి, వేలంలో గత ఏడాది కంటే 10 శాతం అధిక మొత్తాన్ని కూడా పొందలేకపోయారు.

Updated Date - Nov 07 , 2025 | 11:35 PM