పది ఫలితాలు.. మెరుగు
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:05 PM
పదో తరగతి ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా మెరుగు పడింది. గత ఏడాది 89.47 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 28వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 91.91 శాతం ఉత్తీర్ణతతో 24వ స్థానంలో నిలిచింది.
91.91 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 24వ స్థానం
గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా మెరుగు పడింది. గత ఏడాది 89.47 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 28వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 91.91 శాతం ఉత్తీర్ణతతో 24వ స్థానంలో నిలిచింది. ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి హైదారాబాద్ రవీంద్ర భారతీలో బుధవారం విడుదల చేశారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. పరీక్షలకు 12,737 మంది విద్యార్థులు హాజరుకాగా 91.91 శాతం ఉత్తీర్ణతతో 11,706 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 6,524 మంది బాలురు పరీక్ష రాయగా, 89.76 శాతం ఉత్తీర్ణతతో 5 ,856 మంది, 6213 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 94.16 శాతం ఉత్తీర్ణతతో 5,850 మంది పాస్ అయ్యారు. ప్రభుత్వ ఉన్నత, గురుకుల, కేజీబీవీల్లో మంచి ఫలితాలు వచ్చాయి.