దేవాలయాలే టార్గెట్
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:28 PM
దేవాలయాల్లో విగ్రహాల వెండి తొడుగులు, ఆభరణాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి తెలిపారు.
- విగ్రహాల వెండి తొడుగుల చోరీ
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- రూ. 3.96 లక్షలు, రెండు బైకుల స్వాధీనం
- వెల్లడించిన మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి
భూత్పూర్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి) : దేవాలయాల్లో విగ్రహాల వెండి తొడుగులు, ఆభరణాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి తెలిపారు. కేసు వివరాలను భూత్పూర్ సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వనపర్తి ,జిల్లా శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన తోక కర్ణాకర్ అనే వ్యక్తి గత జూలై 31న చిన్నచింతకుంట గ్రామంలోని గంగాభ వానీ దేవాలయం తాళాలు విరగ్గొట్టి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి విగ్రహంపై ఉన్న ఒకటిన్నర కిలోల వెండి తొడుగును ఎత్తుకెళ్లాడు. అదే రోజు మద్దూరు గ్రామంలోని దేవాలయంలో వెండి ఆభరణాలను చోరీ చేశాడు. సంఘటనపై దేవాలయ కమిటీ సభ్యుడు కృష్ణయ్య ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే నిందితుడు తోక కర్ణాకర్ మంగళవారం అమ్మాపూర్ స్టేజీ వద్ద అనుమా స్పదంగా తిరుగుతుండగా చిన్నచింతకుంట ఎస్‌ఐ రాంలాల్, పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో అతడు చేసిన చోరీలకు సంబంధించిన వివరాలను రాబట్టా రు. పెద్దమందడి మండలంలోని మణిగిల్ల, వెల్టూరు, మానవపాడు మండలంలోని అమరవాయి, ఇటిక్యాల మండలంలోని షాబాద్, సాతర్ల, పెబ్బేరు మండలంలోని శాఖాపూర్, కొత్తకోట మండలంలోని చెర్లపల్లి, మదనాపూర్ మండలంలోని అజ్జకోలు గ్రామాల్లోని ఆలయాల్లో అతడు చోరీలకు పాల్పడ్డాడు. ఆయా దేవాలయాల్లో దాదాపు 7 కిలోల వెండి తొడుగులు, ఆభరణాలను చోరీ చేసి విక్రయించినట్లు విచారణలో వెల్లడైం దని ఎస్పీ తెలిపారు. రూ.3,96,200, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లుగా చెప్పారు. కేసును త్వరిగతిన ఛేదించిన ఎస్‌ఐ రాంలాల్, పోలీసు కానిస్టే బుళ్లు నిరంజన్‌రెడ్డి, విష్ణు, బాల్‌రెడ్డి, రవిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినం దించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, చిన్నచింతకుంట ఎస్‌ఐ రాంలాల్ పాల్గొన్నారు.