విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయుడు
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:26 PM
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినులను వేధించిన సంఘటన మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని వీరన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు రమేశ్ పదోతరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఓ విద్యార్థినిని అదే పనిగా వేధిస్తున్నాడని తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినులను వేధించిన సంఘటన మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని వీరన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు రమేశ్ పదోతరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఓ విద్యార్థినిని అదే పనిగా వేధిస్తున్నాడని తెలిసింది. విద్యార్థినులు షీటీమ్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు శుక్రవారం పాఠశాలకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడిని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఉపాధ్యాయుడిని, విద్యార్థులను విచారణ చేశారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థినులతో కలిసి పాఠశాల గేటు ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని వేధింపులకు గురి చేసిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలన్నారు.
పోక్సో కేసు నమోదు చేసే అవకాశం
విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయు డు రమేశ్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిటన్లు సీఐ అప్పయ్య తెలిపారు. సాక్ష్యాలను సేకరిస్తున్నారని చెప్పారు. అమ్మాయి మైనర్ కావడంతో ఫోక్సో కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. పోలీసులు పాఠశాల వద్ద ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను విచారణ చేశారు
జీటీఏ సంఘం నుంచి సస్పెన్షన్
ఉపాధ్యాయుడు రమేశ్‌పై ఆరోపణలు రావడంతో జీటీఏ సంఘం జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిశోర్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు.