Share News

తార్‌మార్‌..టక్కర్‌ మార్‌!

ABN , Publish Date - May 08 , 2025 | 11:52 PM

వనపర్తి జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కేటాయింపుల్లో వింత పోకడలు వెలుగులోకి వస్తున్నాయి.

తార్‌మార్‌..టక్కర్‌ మార్‌!

- వనపర్తి జిల్లాలో ధాన్యం కేటాయింపులో వింత పోకడలు

- ముందు బ్లాక్‌ లిస్టు మిల్లుకు ధాన్యం కేటాయింపు

- అధికారుల పరిశీలనతో అప్రమత్తమై వేరే మిల్లుకు తరలింపు

- తక్‌పట్టీలు కాకపోవడంతో రైతుల ఖాతాల్లో జమకాని డబ్బు

మహబూబ్‌నగర్‌, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వనపర్తి జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కేటాయింపుల్లో వింత పోకడలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి అయ్యే జిల్లా వనపర్తి. సాగునీటి వనరుల లభ్యత పెరిగిన తర్వాత వరి సాగు కూడా గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ కూడా ప్రతీ ఏటా ఎక్కువగానే జరుగుతోంది. ఈ జిల్లాలోనే సీఎంఆర్‌ పెండింగ్‌ మిల్లర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులు, కేసులు నమోదైన మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేయొద్దని ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. వనపర్తి జిల్లా పరిధిలో చాలా డీఫాల్ట్‌ మిల్లులు కూడా ఉన్నాయి. వాటిని బ్లాక్‌ లిస్టులో చేర్చినప్పటికీ.. ఏదో లొసుగు చూపెట్టి అధికారులు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. అది ఒకవేళ ఉన్నతాధికారులకు తెలిస్తే.. తప్పులను సరిదిద్దుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. తాజా ఉదంతం కూడా దాదాపు అలాంటిదే.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఓ బాయిల్డ్‌ మిల్లుకు 2022-2023 వానాకాలం సీజన్‌కు సంబంధించి భారీ మొత్తంలో ధాన్యం కేటాయించారు. నిర్ణీత గడువు ముగిసినప్పటికీ ఆ మిల్లర్‌ సీఎంఆర్‌ను అప్పగించలేదు. కొన్నిరోజుల తర్వాత ఆ మిల్లులో తనిఖీలు చేసిన డీఎస్‌వో కాశీవిశ్వనాథ్‌ బృందం అక్కడ ధాన్యం నిల్వలు లేవని గుర్తించింది. లోతుగా విచారణ చేయగా.. ఆ మిల్లుకు రెండు కోడ్లు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అధికారులు మామూళ్లకు ఆశపడి రెండు వేర్వేరు కోడ్లను ఇచ్చినట్లు తేలడంతో, సదరు మిల్లును బ్లాక్‌ లిస్టులో ఉంచారు. కానీ ప్రస్తుత రబీ సీజన్‌లో తిరిగి ఆ మిల్లుకు ధాన్యం కేటాయించారు.

40 ట్రక్కుల ధాన్యం కేటాయింపు

బ్లాక్‌ లిస్టులో ఉన్న సదరు మిల్లర్‌కు సంబంధించిన మిల్లు వేరే పేరుతో ఉందనే సాకుతో దాదాపు 40 ట్రక్కుల ధాన్యం కేటాయించారు. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని విజయ గోదాముల్లో తొలుత నిల్వ చేశారు. వాస్తవానికి ఒక జిల్లా ధాన్యం మరో జిల్లాలో నిల్వ చేయడానికి లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారనే విషయం బయటకు రావడంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అధికారులు ఆ 40 ట్రక్కుల ధాన్యాన్ని పెబ్బేరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న మరో బాయిల్డ్‌ మిల్లుకు తరలించారు. ఇప్పటికే 2022-23 రబీ సీజన్‌లో వేలం వేసిన ఽధాన్యం మాయం చేసిన మిల్లులకు కూడా ప్రభుత్వం ధాన్యం కేటాయించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు మిల్లుల సామర్థ్యానికి మించి కేటాయింపులు చేయాలని కూడా చెప్పింది. అయినప్పటికీ అధికారులు బ్లాక్‌ లిస్టెడ్‌ మిల్లులకు కేటాయింపులు చేస్తూ, విషయం బయటకు వస్తే తిరిగి సరిదిద్దుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.

60 మంది రైతులకు అందని డబ్బు

సాధారణంగా ప్రతీ ఏటా ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా, ఏఎంసీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఆ ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం మొదట ఆయా జిల్లాల పరిధిలోని మిల్లులకు కేటాయిస్తుంది. ఎక్కువ ధాన్యం వస్తే మిల్లులు ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాలకు తరలిస్తుంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రవాణా టెండర్లు దక్కించుకున్న వారు ఏర్పాటు చేసిన లారీల్లో ఆయా మిల్లులకు పంపిస్తారు. అక్కడ ధాన్యాన్ని తూకం వేసుకుని.. దాని ప్రకారం ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేసుకుని.. తిరిగి మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు పంపిస్తారు. అప్పుడు అధికారులు ట్యాబ్‌ ఎంట్రీ చేసి.. వాటిని రైతుల ఖాతాల్లో పేమెంట్‌ కోసం పంపిస్తారు. అయితే పెబ్బేరులో మొదట కేటాయింపులు చేసిన బ్లాక్‌లిస్టు మిల్లు నుంచి తక్‌పట్టీలు జనరేట్‌ చేయలేదు. దాదాపు 40 ట్రక్కులు పంపించి 16 రోజులపైనే అవుతోంది. ఇప్పుడు వాటిని మరో మిల్లుకు తరలించినప్పటికీ.. ఇంకా తక్‌పట్టీలు జనరేట్‌ కాలేదు. దీంతో ధాన్యం విక్రయించిన దాదాపు 60 మంది రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఖాతాల్లో డబ్బు జమయ్యేందుకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి.

Updated Date - May 08 , 2025 | 11:52 PM