Share News

సర్వే అడ్డగింత

ABN , Publish Date - Aug 06 , 2025 | 10:44 PM

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న కానుకుర్తి రిజర్వాయర్‌ సర్వేకు పోలీసు బందోబస్తుతో వెళ్లిన సర్వే బృందాన్ని, అధికారులను నిర్వాసిత రైతులు బుధవారం వెనక్కి పంపించారు.

సర్వే అడ్డగింత
అధికారులను అడ్డుకొని వెనక్కి పంపిస్తున్న భూ నిర్వాసితులు

కాన్‌కుర్తి రిజర్వాయర్‌ భూ సర్వే కోసం భారీ పోలీసు బందోబస్తుతో వెళ్లిన అధికారులు

న్యాయమైన పరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్‌

నిర్వాసితులతో సమావేశమైన ఆర్డీవో

ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకోవాలని సూచన

మధ్యలోనే వెళ్లిపోయిన బాధితులు

దామరగిద్ద, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న కానుకుర్తి రిజర్వాయర్‌ సర్వేకు పోలీసు బందోబస్తుతో వెళ్లిన సర్వే బృందాన్ని, అధికారులను నిర్వాసిత రైతులు బుధవారం వెనక్కి పంపించారు. మండలంలోని కానుకుర్తి, మల్‌రెడ్డిపల్లి, గడిమున్కన్‌పల్లి శివారులో సర్వే కోసం నారాయణపేట ఆర్డీవో రాంచందర్‌, తహసీల్దార్‌ తిరుపతయ్య, ఆర్‌ఐ బాల్‌రాజు సర్వే బృందం డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య వెళ్లారు. సర్వే నిర్వహిస్తుండగా భూములు కోల్పోయే రైతులు అధిక సంఖ్యలో తరలి వచ్చి, అడ్డుకున్నారు. తమకు ఎకరాకు ఎంత పరిహారం ఇస్తారో చెప్పడకుండానే సర్వే చేయొద్దని అన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు రూ.60 లక్షల ధర పలుకుతుంటే ప్రభుత్వం రూ.14 లక్షలు ఇస్తామంటే ఎలా తీసుకోవాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మచ్చేందర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ రైతులకు న్యాయం చేసే వరకు సర్వే చేయొద్దని పట్టుబట్టారు. దాంతో అధికారులు సాయంత్రం దామరగిద్ద మండలం కాంప్లెక్స్‌ సమావేశ మందిరంలో రైతులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని, రైతులకు ప్రభుత్వ పథకాలలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ఆర్డీవో చెప్పారు. రైతులు తమ భూములు తీసుకుంటే రైతుబంధు, రైతు బీమా కోల్పోతామన్నారు. కనీసం బహిరంగ మార్కెట్‌ రేటు ప్రకారం రూ.50 లక్షలు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని పట్టుబట్టారు. న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే భూములు ఇవ్వబోమని సమావేశం నుంచి వెళ్లిపోయారు. అప్పటి వరకు తమ భూముల వద్దకు రావొద్దని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, భీంరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్‌, మహే్‌షకుమార్‌ గౌడ్‌, మొగులప్ప, శ్రీనివా్‌సరెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 10:44 PM