చేదెక్కుతున్న చెరుకు
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:31 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా చెరుకు సాగు గణనీయంగా తగ్గిపోతోంది. వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలోని రామకృష్ణాపురం వద్ద 2010లో కృష్ణ వేణి చెరుకు పరిశ్రమ ఏర్పాటైంది.
- ప్రతీ సంవత్సరం తగ్గుతున్న సాగు విస్తీర్ణం
- గిట్టుబాటు ధర దక్కక రైతుల అనాసక్తి
- ఈ ఏడాది 6 వేల ఎకరాల్లోనే సాగు
ఆత్మకూరు , జూలై24 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా చెరుకు సాగు గణనీయంగా తగ్గిపోతోంది. వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలోని రామకృష్ణాపురం వద్ద 2010లో కృష్ణ వేణి చెరుకు పరిశ్రమ ఏర్పాటైంది. ప్రారంభంలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు, కర్నూల్ జిల్లాల్లో 16 వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. ఆ తర్వాత నెలకొన్న వివిధ సమస్యలతో క్రమక్రమంగా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రస్తుతం 6 వేల ఎకరాల పైచిలుకు మాత్రమే సాగవుతోంది. పరిశ్రమ క్రష్షింగ్ సామర్థ్యానికి సరిపోను దిగుబడి కూడా రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వనపర్తి జిల్లాలో 3,800, నారాయణపేట జిల్లాలో 1,700, జోగుళాంబ గద్వాల, కర్నూలు జిల్లాల్లో 800, నాగర్‌కర్నూల్ జిల్లాలో 38, మహబూబ్‌నగర్ జిల్లాలో 210 ఎకరాల్లో చెరుకు సాగవుతోంది. ఈ ఏడాది 2.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి తెలిపారు.
లభించని ప్రోత్సాహం
చెరుకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. దీంతో క్రమంగా వారు ఇతర పంటల సాగువైపు మొగ్గు చూపుతు న్నారు. పరిశ్రమ ప్రారంభ సమయంలో యాజ మాన్యం రైతులకు ఉచితంగా సీడ్స్ ఇచ్చి, సాగుకు సలహాలు, సూచనలు చేసేవారు. ప్రస్తుతం సీడ్ ఇచ్చేందుకు పరిశ్రమ నిబంధనలు విధించింది. ఎకరా నికి 40 టన్నుల దిగుబడి ఇస్తేనే సీడ్స్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. దీంతో రైతులు చెరుకు సాగుపై ఆసక్తి చూపడం లేదు.
పట్టించుకోని పరిశ్రమ యాజమాన్యం
కృష్ణవేణి పరిశ్రమ యాజమాన్యం గతంలో చెరుకు రైతులకు వెన్నంటి ఉండేది. దిగుబడిని అందించిన నెల రోజుల్లో, పరిశ్రమ యాజమాన్యం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేది. కానీ గత నాలుగేళ్ల నుంచి డబ్బు సరిగా ఇవ్వకపోవడం, గిట్టుబాటు ధర కల్పించకపోవడం, కటింగ్ కార్మికులు, రవాణా తదితర విషయాలను పట్టించుకోవడం లేదు. గిట్టుబాటు ధర విషయంపై రైతులు పలుమార్లు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి, వినతిపత్రాలు ఇచ్చారు. అయినా టన్నుకు రూ. 3 వేలకు పైగా ధర పెరగకపోవడంతో రైతులు విసిగిపోయారు. దీనికి తోడు మొదటి పంట 30 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వచ్చినా, రెండో పంట ప్రారంభ దశలోనే వేరు పురుగు ఆశించి దెబ్బతింటోంది. దీంతో ఎకరానికి 20 టన్నులు కూడా దిగుబడి రావడం లేదు.
అమలు కాని బోనస్ హామీ
తమిళనాడు తరహాలో చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు టన్నుకు వెయ్యి రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ, ఇప్పటివరకు అమలు చేయలేదు. దీనికి తోడు మద్దతు ధరపై కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా చెరుకు రైతులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ యజమానులతో చర్చలు జరిపి, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, టన్నుకు వెయ్యి రూపాయల బోనస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
చెరుకు రైతులను ఆదుకోవాలి
చెరుకుకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కౌలు రైతులు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. టన్నుకు రూ. 4500 ధర చెల్లిస్తే గిట్టు బాటు అయ్యే అవకాశం ఉంది. రెండో పంటకు వేరు పురుగు ఆశించకుండా రైతులకు అవగాహన కల్పించాలి.
- ఆంజనేయులు, రైతు, అమరచింత
తమిళనాడు తరహాలో బోనస్ ఇవ్వాలి
చెరుకు రైతులకు తమిళనాడు రాష్ట్రంలో టన్నుకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తున్నారు. అదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా అమలు చేయాలి. ఈ విషయంపై ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలి. చెరుకు రైతులకు ప్రోత్సాహకాలు అందించి సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలి.
- జీఎస్ గోపి, చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు