కృష్ణ-వికారాబాద్ రైల్వేలైన్‌కు.. అడుగులు
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:49 PM
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కృష్ణ - వికారాబాద్ రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో నారాయణపేట, వికారాబాద్ జిల్లాల ప్రజలలో రైల్వేలైన్‌పై ఆశలు చిగురించాయి.
భూ సేకరణకు రూ.438 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
122 కి.మీ. దూరం రూ. 2.196 కోట్ల అంచనా
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్‌కు లైన్ క్లియర్
నారాయణపేట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కృష్ణ - వికారాబాద్ రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో నారాయణపేట, వికారాబాద్ జిల్లాల ప్రజలలో రైల్వేలైన్‌పై ఆశలు చిగురించాయి. 35 ఏళ్లుగా సర్వేలకే పరిమితమై ఎన్నికల హామీగా మిగిలి ప్రభుత్వాలు, పాలకులు మారుతూ వచ్చారు. కానీ, ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం గుండా రైల్వేలైన్ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రైల్వేశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికిగాను రాష్ట్రంలో 5,299 కి లోమీటర్లకు పైగా కొత్త రైల్వేలైను నిర్మాణానికి రూ. 83.543 కోట్లు మంజూరు చేసింది. అందులో కృష్ణ - వికారాబాద్ రైల్వేలైన్ 122 కి.మీ. దూరానికి రూ. 2.196 కోట్ల అంచనా వ్యయంతో నిధులు కేటాయించింది. ఈ మేరకు భూసేకరణ కోసం రూ. 438 కోట్లు కేటాయిస్తూ ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కొడంగల్ మీదుగా అలైన్‌మెంట్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మీదుగా 122 కిలోమీటర్ల దూరంలో కృష్ణ-మక్తల్ -నారాయణపేట- దామరగిద్ద- బాలంపేట- దౌల్తాబాద్-కొడంగల్-పరిగి-వికారాబాద్ మీదుగా 2,196 కోట్ల అంచనా వ్యయంతో స్పల్ప మార్పులు చేర్పులతో కొత్త రైల్వేలైన్ మార్గానికి తుది సర్వే తాజాగా పూర్తిచేశారు. భూసేకరణ, సాంకేతిక, ఆర్ధిక అంశాలపై అధికారులు సమగ్ర ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి రైల్వే బోర్డుకు అందించారు. రైల్వేలైన్ నిర్మాణ వ్యయాన్ని వంద శాంతం కేంద్ర ప్రభుత్వమే భరించాలని సీఎం రేవంత్‌రెడ్డి గత ఏడాది 2024 జనవరి 31న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. అయితే హైదరాబాద్ నుంచి గోవాలోని మడ్‌గావ్ రైల్వే స్టేషన్‌కు జడ్చర్ల, గద్వాల, డోన్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ మీదుగా రైళ్లు వెళుతున్నాయి. కృష్ణ మండలం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉండగా కర్ణాటకలోని జంక్షన్ రాయిచూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వికారాబాద్ కృష్ణ ప్రతిపాదిత రైలు మార్గం కార్యరూపం దాల్చితే హుబ్లీ, గోవాలోని మడ్‌గావ్‌కు 40 కిలోమీటర్ల వరకు దూరం దగ్గే అవకాశం ఉంటుంది. తాండూరు సిమెంటు పరిశ్రమల నుంచి సిమెంటు రవాణాకు సులభం అవుతుంది. గుంతకల్ మార్గంలో ట్రాక్ రద్దీగా ఉంటుంది. అదనపు రైళ్లు ప్రవేశపెట్టడం కష్టం. ఈ రైల్వే లైన్‌తో మేలు జరుగుతుంది.
35 ఏళ్ల్లుగా ఊరిస్తూ...
కర్ణాటక - తెలంగాణ సరిహద్దులో ఉన్న నారాయణపేట మీదుగా 35 ఏళ్ల క్రితం కృష్ణ - వికారాబాద్ రైల్వేలైన్ ఏర్పాటుకు భీజం పడి ఊరిస్తూనే ఉంది. అప్పట్లో మక్తల్, ఊట్కూర్, నారాయుణపేట, అభంగాపూర్, మద్దూర్, కోస్గి, సర్జఖాన్ పేట్ మీదుగా వికారాబాద్ జిల్లాలో దోమ, పరిగి, వికారాబాద్ వరకు 121.70 కి.మీ. రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 610 కోట్లు అవసరమని 2010లో హైదరాబాద్‌లోని ఓ సంస్థ ఏరియల్ సర్వేచేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్‌లో ప్రస్తావించినప్పటికీ నిధుల కేటాయింపు జరుగలేదు. నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల హామీగా ఈ రైల్వేలైన్ మిగిలింది. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా మహబూబ్‌నగర్ ఎంపీ మల్లికార్జున్ తొలిసారి సర్వే చేయించారు. కృష్ణ నుంచి వికారాబాద్ వరకు రైల్వేలైన్ కలిపే విధంగా సర్వేను రూపొందించారు. తర్వాత జనతాదళ్ నుంచి ఎంపీగా గెలిచిన జైపాల్‌రెడ్డి ప్రయత్నం మేరకు మరోసారి సర్వే చేయించారు. అప్పట్లో రూ. 87 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిధులు మాత్రం కేటాయించలేదు. ఇక 1999 పార్లమెంట్ ఎన్నికల్లో మల్లికార్జున్, జైపాల్‌రెడ్డి ఇద్దరూ ఎన్నికల ప్రచార అస్త్రంగా రైల్వేలైనును లేవనెత్తారు. మల్లికార్జున్ గెలిచినా కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావడంతో ప్రయత్నం ఫలించలేదు. 1991లో పీవీ నర్సింహారావు మంత్రి మండలిలో మల్లికార్జున్‌కు చోటు లభించడంతో రైల్వేలైన్‌పై ఈ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురించినా సర్వేలకే పరిమితమై ఆచరణకు నోచుకోలేదు. 2013లో నారాయణపేటలో కృష్ణ- వికారాబాద్ రైల్వేలైన్ సాధన కమిటీ అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని కన్వీనర్ సాయిబాబా నేతృత్వంలో కోకన్వీనర్లు రఘువీర్‌యాదవ్, బండి వేణుగోపాల్, సూర్యకాంత్, అబ్దుల్ ఖాదర్ బిచ్చు, డాక్టర్ వై.మల్లికార్జున్ తదితరులు అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గేను కలిసి ఒత్తిడి తీసుకువచ్చారు. 2012, జూలై 7న వికారాబాద్ కృష్ణ రైల్వేలైను సర్వేకోసం రూ. 22,20 లక్షలు నిధులు కూడా మంజూరు కాగా 2013 వరకు సర్వేచేసి భూసేకరణ కోసం మార్కెట్ ధర కనుగుణంగా సబ్ రిజిస్ట్రార్, ఆర్డీఓ కార్యాలయం నుంచి నివేదికలను రారుఽుచూర్‌కు చెందిన ఇంజనీయర్ సేకరించి రైల్వేశాఖకు సమర్పించారు. అప్పట్లో మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి తనయుడు సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉండగా కర్నూల్‌కు స్థానిక రైల్వే సాధన సమితి సభ్యులు వెళ్లి కలసి వినతిపత్రం సమర్పించి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ రైల్వేలైన్ సర్వేలకే పరిమితమై నిధుల కేటాయింపు కాకపోవడంతో ఈ రైల్వేలైన్ ఎప్పుడు నోచుకుంటుందో అని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రివర్గం భూసేకరణకు నిదులు కేటాయించి ఒక అడుగు ముందుకు వేసింది. ఈ రైల్వేలైన్‌పై హబుబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ రైల్వే మంత్రిని కలిసి విన్నవించారు. కేంద్ర ం ఈ రైల్వేలైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో రైలు సౌకర్యం కలుగనుంది.
రైల్వేలైన్‌తో మరింత అభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేలైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెనుకబడిన నారాయణపేట ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. రైల్వేలైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రులను, సహాయ మంత్రులను కలిసి వినతి పత్రాలను అందించాం. 35 ఏళ్ల కళ నేడు నెరవేర్చేలా రైల్వేలైన్‌కు భూసేకరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన మంత్రి మండలి రూ. 438 కోట్లు మంజూరు చేయడం శుభపరిణామం. ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు.
- డా.సాయిబాబా, రైల్వేలైన్ సాధన సమితి అధ్యక్షులు, నారాయణపేట