Share News

కళ తప్పిన క్రీడా ప్రాంగణాలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:35 PM

పల్లె ప్రాంతాల్లోని యువత, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి.

కళ తప్పిన క్రీడా ప్రాంగణాలు
షేక్‌పల్లి గ్రామంలో ముళ్ల చెట్లతో దర్శనమిస్తున్న క్రీడా ప్రాంగణం

- నిర్వహణ లేక ప్రజాధనం వృథా

- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

గండీడ్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పల్లె ప్రాంతాల్లోని యువత, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. 2022 జూన్‌ 2న అట్టహాసంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేశారు. గండీడ్‌, మహమ్మదాబాద్‌ మండలాల్లోని 49 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసినా ప్రస్తుతం గుట్టలు, చెట్లతో దర్శనమిస్తున్నాయి. గతంలో క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో క్రీడా కిట్లు, ఆట వస్తువులను యువతకు పంపిణీ చేయడానికి ఆదేశాలు అందినా సరైన క్రీడా ప్రాంగణాలు లేకపోవడంతో పంచాయతీ భవనాలకే పరిమితమయ్యాయి.

రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు

ప్రతీ గ్రామంలో గ్రామ పంచాయతీకి ఉపాధి హామీలో భాగంగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు సర్పంచుల పాలన లేనందున వీటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం క్రీడా ప్రాంగణాల్లో పశువులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, చాలా చోట్ల క్రీడా మైదానాల్లో ఆటలు ఆడేందుకు వీలు లేకుండా కంపచెట్లు దర్శనమిస్తున్నాయి.

బోర్డులకే పరిమితం

క్రీడా ప్రాంగణాల్లో ఆటలు ఆడేందుకు దాదాపు ఐదెకరాలకు పైగా ఆట స్థలం ఉండాలి. కానీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో, గుట్టల్లో, స్థలాలు లేకపోయినా బోర్డులు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆటలు ఆడేందుకు యువత ఆసక్తి కనబర్చలేక కేవలం బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

Updated Date - Nov 09 , 2025 | 11:35 PM