శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో వేగంగా మరమ్మతులు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:27 PM
ఐదు సంవత్సరాల క్రితం 2020 ఆగస్టు 20న షాట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైన శ్రీశైలం ఎడమగట్టు నాలుగో యూనిట్
- నాలుగో యూనిట్‌లో రోటార్ బిగింపు
- వ చ్చే నెల మొదటి వారానికి పూర్తి చేసేందుకు కసరత్తు
బ్రహ్మగిరి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఐదు సంవత్సరాల క్రితం 2020 ఆగస్టు 20న షాట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైన శ్రీశైలం ఎడమగట్టు నాలుగో యూనిట్ మరమ్మతులు అక్టోబరు మొదటి వారం వరకు పూర్తి చేసేందుకు జెన్‌కో అధికారులు, వాయిత్ కంపెనీ సిబ్బంది కృషి చేస్తున్నారు. బుధవారం నాలుగో యూనిట్ స్టేటార్‌లో రోటార్‌ను బిగించారు. (రోటార్ లోవరింగ్) అగ్ని ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాలకు 2023లో మరోసాగి నాలుగో యూనిట్‌ను ప్రారంభించినా మూడు వారాలలోపే సాంకేతిక లోపంతో స్ట్టేటార్‌లో షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వైండింగ్ బార్స్ కాలిపోయి సమస్య మొదటికి వచ్చింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగో యూనిట్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గత సంవత్సరం మరోసారి జెన్‌కో యాజమాన్యం నిధులను కేటాయించింది. దీంతో నాలుగో యూనిట్ పనులు చేసేందుకు వాయిత్ కంపెనీ పనులు ప్రారంభించింది.
రోటార్ బిగింపు పనులు
నాలుగవ యూనిట్‌ను ఈ ఏడాది వినియోగంలోకి తెచ్చేందుకు జెన్‌కో యాజమాన్యం సంవత్సరం కాలం పాటు శ్రమించి ఎట్టకేలకు స్టేటార్‌లో రోటార్‌ను బిగించారు. ఆప్పటికే స్టేటార్ వైండింగ్ టెస్టు చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు రోటార్ అప్పర్ బ్రాకెట్, అప్పర్ గైడ్ బేరింగ్ (యూజీసీ), టాప్ ఎండ్ బెల్‌కవర్స్, చక్కర్ ప్లేట్స్, మరికొన్ని సాంకేతికమైన పనులు పూర్తి చేసి అక్టోబరు మొదటి వారంలో నాలుగో యూనిట్‌ను పరీక్షించి, అన్నీ సవ్యంగా జరిగితే విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు జెన్‌కో యాజమాన్యం కృషి చేస్తోందని జెన్‌కో ఇంజనీర్లు తెలిపారు.