వెలగని సోలార్.. కాంతులు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:26 PM
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘సూర్యఘర్’ పథకానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లే దు. పథకం ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా జిల్లాలో కేవలం 284 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
పాలమూరులో ‘సూర్యఘర్’కు ఆదరణ కరువు
మేడపైన.. ఖాళీ స్థలాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుతో విద్యుత్ ఉచితంగా వాడుకునే అవకాశం
మిగిలినది అమ్ముకోవడం ద్వారా అదనపు ఆదాయం
ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితం..
మిగతా వారికి కిలో వాట్‌కు రూ.30 వేల రాయితీ
రెండేళ్లలో వచ్చినవి 284 దరఖాస్తులే..
పాలమూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘సూర్యఘర్’ పథకానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లే దు. పథకం ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా జిల్లాలో కేవలం 284 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దాంతో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, దరఖాస్తులు ఆహ్వానించాలని విద్యుత్ సంస్థ ఆలోచిస్తోంది.
ఇదీ పథకం ఉద్దేశం
ఇంటి పైకప్పుపై, ఖాళీ స్థలాల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని, ఇంటికి సరిపడా విద్యుత్‌ను వాడుకోవచ్చు. మిగిలిన దాన్ని ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు అమ్ముకుని ఆదాయం పొందొచ్చు. అందుకోసం ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. మహిళా సంఘం సభ్యులకు ప్రాధాన్యం ఇస్తోంది. అయినా ఆసక్తి చూపడం లేదు. ఇంటిపై కప్పుపై పది చదరపు మీటర్ల స్థలంలో ఒక కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూప్‌టాప్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
174 మందికి మంజూరు
సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం 2024 ఫిబ్రవరి 15న అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 284 మంది దరఖాస్తు చేసుకున్నారు. 174 మందికి మంజూరు చేశారు. 110 దరఖాస్తులు ప్రాసె్‌సలో ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ల లేదు. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చాక అవగాహన కల్పించింది. అయితే గృహజ్యోతి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం వల్ల కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మొగ్గు చూపడం లేదు.
సబ్సిడీ ఇలా..
ఒకసారి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఖర్చవుతుంది. రూ.30 వేల వరకు ప్రభత్వం సబ్సిడీ అందిస్తుంది. రెండు కిలోవాట్ల ప్లాంట్ అయితే రూ.లక్ష నుంచి రూ.1.45 లక్షల వేల వరకు ఖర్చవుతుండగా, రూ.60 వేల వరకు మూడు కిలోవాట్లు అయితే రూ.1.80 లక్షల నుంచి రూ.2.20లక్షల ఖర్చవుతుండగా, రూ.90 వేల వరకు రాయితీ పొందొచ్చు.
మాడల్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిని సోలార్ మాడల్ విలేజ్‌గా ప్రభు త్వం ఏర్పాటు చేసింది. గ్రామం లో దాదాపు 600 వరకు సోలార్ కనెక్షన్లు ఇచ్చారు.
ప్రజలకు మేలు
సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఇది ప్రజలందరికీ మేలైన పథకం. సద్వినియోగం చేసుకోవాలి.
- పి.వెంకట రమేష్, టీజీ ఎస్‌పీడీసీఎల్ ఎస్.ఈ, మహబూబ్‌నగర్T