డిసెంబరు 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:02 PM
రాబోయే రెండేళ్లల్లో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ (ఎస్‌ఎల్‌బీసీ) పను లను పూర్తి చేసి రైతులు, ప్రజల పట్ల తమ నిబద్దతతను నిరూపించుకుంటామని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
- పదేళ్లపాటు జిల్లా ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
- జగన్‌తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కారణంగానే రెండు జిల్లాలకు అన్యాయం
- నాలుగు రోజుల్లో సర్వే నివేదిక
- మన్నెవారిపల్లిలో విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాబోయే రెండేళ్లల్లో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ (ఎస్‌ఎల్‌బీసీ) పను లను పూర్తి చేసి రైతులు, ప్రజల పట్ల తమ నిబద్దతతను నిరూపించుకుంటామని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారి పల్లిలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఔట్ లెట్ నుంచి సోమవారం చేపట్టిన హెలీబార్న్ ఎలకో్ట్రమాగ్నటి క్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో సీఎం మాట్లాడుతూ.. పాలమూరు, నల్గొండ జిల్లాలకు సాగునీటి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానంగా తెర మీదకు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్ల కాలంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలకు ఒరుగబెట్టిందే మి లేదన్నారు. అంతేకాకుండా కృష్ణానది జలాల విషయంలో నాటి ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌తో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకుని రైతాంగాన్ని నిండా ముంచారన్నారు. కృష్ణా జలాల విషయంలో సింహాభాగం ఆంధ్రాకు దక్కేలా చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమ్ముడుపోయిందని విమర్శించారు. కృష్ణానది జలాల్లో దాదాపు 500 టీఎంసీల నీటిని విని యోగించుకునే అవకాశం పాలమూరు, నల్గొండ జిల్లాలకు ఉన్నప్పటికీ అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రేక్షకపాత్ర పోషించాడని విమ ర్శిం చారు. దీంతో పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయావని, ఈ కారణంగా కృష్ణానది జలాల వాటా విషయంలో ఆంధ్రాకు తమ వాదనలు సుప్రీంకోర్టు, ట్రిబ్యూనల్‌లో వినిపించే వెసులుబాటు కలిగిందన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నల్గొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం దొరకదు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే శక్తుల పట్ల ఐక్యంగా ఉద్యమించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణాన్ని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో 30లక్షల మందికి రక్షిత తాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆయన చెప్పారు.
నాలుగు రోజుల్లో సర్వే నివేదిక..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకం పనులను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అధునాతనమైన హెలీబార్న్ ఎలకో్ట్రమాగ్నటిక్ జియోఫిజికల్ సర్వేకు క్యాబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఎస్‌ఎల్‌బీసీ రిస్క్యూ ఆపరేషన్‌లో కీలక భూమిక నిర్వహించిన కల్నల్ పరిషత్ మోహారాను డిప్యూటేషన్‌పై తెలంగాణకు తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కెనడాకు చెందిన హెలీబార్న్ ఎలకో్ట్రమాగ్నటిక్ టెక్నాలజీ దోహదపడనుంది. హెలికాప్టర్ ద్వారా నిర్వహించే ఈ సర్వే భూమి అంతర్భాగంలో 30 నుంచి వెయ్యి మీటర్లలోపు ఉన్న పరిస్థితిని ప్రతీ 200మీటర్లకు సంబంధించిన నివేదికను సూక్ష్మస్థాయిలో అందిస్తోంది. దోమలపెంట నుంచి మన్నెవారిపల్లి వరకు పూర్తి కావాల్సిన మరో 9.8కిలో మీటర్ల టన్నెల్ తవ్వకానికి సంబంధించి ఎదురయ్యే భౌగోళిక పరిస్థితులన్నింటినీ ఈ సర్వే పరిష్కార మార్గాన్ని చూయించనుంది. ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌లో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తిరిగి పనులు పునఃప్రారంభిస్తే ప్రాణ నష్టం జరగకుండా ఆచితూచి అడుగు వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. బ్లాస్టింగ్, డ్రిల్లింగ్ విధానంలో మిగతా టన్నెల్ తవ్వకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దోమలపెంట ఇన్‌లెట్‌లో జరిగిన ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసం కావడంతో బ్లాస్టింగ్ విధానం తప్పమరో ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. అయితే పర్యావరణానికి హానీ కలుగకుండా ఖచ్చితంగా బ్లాస్టింగ్, డ్రిల్లింగ్ విధానంలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు ప్రపంచంలో టన్నెల్ నిర్మాణ రంగానికి సంబంధించిన సంస్థలన్నీ నివేదిక సమర్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా పనుల పునఃప్రారంభానికి అడుగులు వేసింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా ఉండాలనే క్రమంలో హెలీబార్న్ ఎలకో్ట్రమ్యాగ్నటిక్ సర్వే వైపు మొగ్గు చూపింది.