షాడోలకు షాక్
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:06 PM
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలంటేనే ఆధిపత్య పోరు ఉంటుంది. పార్టీలు వృద్ధి చెందాలన్నా, ఎమ్మెల్యేలుగా గెలుపొందాలన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో గెలిచే ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల కేడర్ చాలా ముఖ్యం.
తామే ఎమ్మెల్యేలకు ప్రతినిధులమనే వారి గ్రామాల్లో వ్యతిరేక తీర్పు
వారి వల్ల ఎమ్మెల్యేలకు చెడ్డపేరు.. పంచాయతీ ఎన్నికల్లో అది స్పష్టం
షాడోలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రభావం
అసలైన కేడర్‌ను గుర్తించి.. పట్టించుకోకపోతే భవిష్యత్ ఎన్నికలూ ఇంతే..
మహబూబ్‌నగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలంటేనే ఆధిపత్య పోరు ఉంటుంది. పార్టీలు వృద్ధి చెందాలన్నా, ఎమ్మెల్యేలుగా గెలుపొందాలన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో గెలిచే ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల కేడర్ చాలా ముఖ్యం. ఈ బలం లేకపోతే ఎంత పెద్ద పార్టీ అయినా రాష్ట్రస్థాయిలో అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన్నా, బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి స్థానిక సంస్థల్లో తగినంత బలం లేకపోవడమే కారణంగా చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల సర్పంచుల ఎన్నికలు ముగిశాయి. ఈ రెండు విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ సీట్లను గ్రామీణ ఓటర్లు కట్టబెట్టారు. అదే సమయంలో బీఆర్‌ఎ్‌సను కూడా భారీగానే ఆశీర్వదించారు. బీఆర్‌ఎస్ రా ష్ట్రంలో అధికారం కోల్పోయినా, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు రాకపోయినా, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర భావం చూపుతోందంటే దానికి కూడా ఆ పార్టీ గ్రామీణ కేడర్ బలంగా ఉండటమే కారణం.
కారణాలివీ..
కాంగ్రెస్ పార్టీ వన్‌సైడ్ సీట్లను గెలవకపోవడానికి కారణం.. కొందరు ఎమ్మెల్యేలు నేల విడిచి సాము చేయడం ఒక కారణమైతే, కొందరు షాడోలు మరో కారణంగా చెప్పొచ్చు. ఎమ్మెల్యేలను చెరబట్టిన ఆ నాయకుల వల్ల చాలా మండలాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చాయని చెప్పవచ్చు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు తాము పోటీలో ఉన్నప్పుడు తమ వెంట నడిచారనే కారణంతో గౌరవించి.. వెంట తిప్పుకుంటే వారికే చెడ్డపేరు తీసుకొస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కళ్లు తెరిచి, సొంతంగా కేడర్‌కు భరోసా ఇచ్చే పని కల్పించకపోతే రానున్న మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ప్రతికూల ప్రభావం పడనుంది. గుర్తులేని ఎన్నికలే ఇలా ఉంటే.. గుర్తు ఉన్న ఎన్నికలైతే నష్టం ఎక్కువగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దర్పమే ఓడించిందా?
రాజకీయాల్లో కర్రు కాల్చి వాత పెట్టారనే మాట తరచూ విం టుంటాం. అచ్చంగా ఎ మ్మెల్యేలను చెరబట్టిన షాడోల పరిస్థితి కూడా మండలాల్లో అదే విధంగా ఉంది. తామే ఎమ్మెల్యేకు ప్రతినిధులమని చెప్పుకుని కొంద రు గ్రా మాల్లో చేసే ఆగడాలు మామూలుగా ఉండటం లేదనే విమర్శలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా ఆ చక్రబంధంలో ఇరుక్కుపోయారు. తమ వెంట నడిచారనే సానుభూతితో అక్కున చేర్చుకోవడాన్ని ఆసరాగా చేసుకుని, గ్రామాల్లో ఏ పని ఉన్నా తమ ద్వారానే వెళ్లాలనే సంకేతాలు ఇవ్వడం, నేరుగా వెళ్లిన వారికి పని కాకుండా అడ్డుపడటం జరుగుతోంది. మండలాల్లో అధికారులపై తమకు నచ్చిన పని చేయాలంటూ ఒత్తిడి తేవడం, ఎమ్మెల్యే వెంట ఉంటారు కాబట్టి అని వారు ఏమనలేకపోవడం, నచ్చని వారిపై కేసులు పెట్టించడం, ఏదో ఒక సమస్యలో ఇరికించడం ఆయా షాడో నాయకులు చేస్తున్నారు. నిత్యం ఎమ్మెల్యేల వెంటనే ఉంటూ.. అసలైన కేడర్‌తో వివాదాలు పెట్టుకుని, పార్టీని ఎదగనివ్వకపోవడం వంటి అంశాలు అటు పార్టీపై, ఇటు ఎమ్మెల్యేలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎమ్మెల్యేలు మాత్రం తాము పారదర్శకంగా ఉన్నామని భావిస్తున్నారు. కానీ, తమ వెంట నడిచే కేడర్ ఎంత పారదర్శకంగా ఉంటున్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు. దాంతో ఆయా మండలాల్లో ఎమ్మెల్యేల షాడోలమని చెప్పుకుని, దర్పం ప్రదర్శించే వారి సొంత గ్రామాల్లో ఓటర్లు బీఆర్‌ఎస్ లేదా స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టారు.
పోలింగ్ ముందు చేష్టలతోనూ..
ఏ పార్టీ మద్దతుదారుకైనా ఎన్నికల్లో గెలవాలనే ఉంటుంది. ఎవరికి తోచిన విధంగా వారు సామాదాన దండోపాయాలు వాడుతూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా ప్రతీ స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉంటాయని చెబుతారు. అలాంటి సమయంలో కూడా కొందరు షాడో నాయకులు, ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులమని చెప్పుకునే వారు చేసిన చేష్టలతోనే ప్రతికూల ఫలితం వచ్చిందని భావిస్తున్నారు. ఉదాహరణకు ఒక షాడో నాయకుడి గ్రామంలో ప్రత్యర్థి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రూ.1.50 లక్షల విలువ చేసే మద్యం పంపిణీ కోసం తెచ్చాడు. అది గుర్తించిన షాడో నాయకుడు పోలీసులకు ఆ మద్యాన్ని పట్టించాడు. దాంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటర్ల వద్దకు వెళ్లి మీకు ఇద్దామని తెచ్చిన మద్యం షాడో నాయకుడు పట్టించాడు. ఏం ఇవ్వలేను అని చెబుతూ ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించాడు. దీంతో సింపతీ వచ్చింది. ఒక దశలో సదరు అభ్యర్థి గెలుపు ఆశను కూడా వదులుకున్నారు. అయినా విజయం వరించింది. అలాగే కొందరు అభ్యర్థులపై కేసులు పెట్టించడం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఇళ్లలో వేసి తాళం వేయడం వంటి అంశాలు గ్రామస్థుల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఒక ప్రజాప్రతినిధి ఊర్లో కూడా ఇదే తరహాలో మద్యం పట్టించడం, పోలింగ్ ముందు రోజు అనుచరులు హడావుడి చేయడంతో గ్రామస్థుల్లో కొంత అశాంతిని కల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో షాడోల అరాచకం వల్లనే ప్రతికూల ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.