ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:29 PM
దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆయా ఆలయాల కమిటీ చైర్మన్ల ఇంటి నుంచి అమ్మవారి స్వర్ణ ఆభరణాలు, పట్టు వస్త్రాలు భాజాభజంత్రీతో ఊరేగింపుగా తీసుకొచ్చారు.
- ఊరేగింపుగా అమ్మవారి అభరణాలు
- పూజలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్/జడ్చర్ల/దేవరకద్ర/హన్వాడ/భూత్పూర్/నవాబ్‌పేట/చిన్నచింతకుంట/మూసాపేట /గండీడ్,సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆయా ఆలయాల కమిటీ చైర్మన్ల ఇంటి నుంచి అమ్మవారి స్వర్ణ ఆభరణాలు, పట్టు వస్త్రాలు భాజాభజంత్రీతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణతో విశిష్ట పూజలు నిర్వహించి స్వర్ణకపచాలంకృత దేంఆగా అలంకరించారు. బ్రాహ్మణవాబొలోని వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి బంగారు చీర, వెండి ఆభరణాలు సమర్పించే కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కొత్తగంజి లక్ష్మీనరసింహ్మ ఆలయంలో మూడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహ్మరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, ఆలయ కమిటీ చైర్మన్ పోల శ్రీనివాస్, డీసీసీ కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, చందుయాదవ్, రామకృష్ణ పాల్గొన్నారు. ఏనుగొండలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో, వెండి పోచమ్మ ఆలయంలో, పోచమ్మ ఆలయంలో, అశోక్ టాకీస్ చౌరస్తాలోని అంభభవావీ ఆలయంలో, బండమీదిపల్లి లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా ప్రారంభించుకున్నారు. జడ్చర్ల పట్టణంలోని వాసవీకన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహన్ని ప్రతిష్ఠించి మొదటిరోజు అర్ధనారీశ్వరీ దేవీగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అమ్మవారిని శైలపుత్రి అలంకారంతో అలంకరించారు. సాయంత్రం బతుకమ్మను మహిళలు ఆడారు. సకలదేవతల ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి బాలాత్రిపుర సుందరీగా దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా గౌరీగణపతి పూజ, ధ్వజారోహణం, పుణ్యాహవాచనం, నాందిసమారాధన, నవగ్రహ, అంకురార్పణ, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. విద్యానగర్‌కాలనీలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు బాలత్రిపురా సుందరీగా దర్శనమిచ్చారు. దేవరకద్ర మండల కేంద్రంలోని ఈశ్వర వీరప్పయ్యస్వామి ఆలయంలో అమ్మవారిని మొదటి రోజు బాలాత్రిపుర సుందరీగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. హన్వాడ మండల కేంద్రంలో సోమవారం దుర్గాదేవీ బాలాత్రిపర సుందరీగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భూత్పూర్ మునిసిపాలిటీ అమిస్తాపూర్ గ్రామ శివారులో ఉన్న సాక్షి గణపతి ఆలయంలోని సరస్వతి ఆలయంలో అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వగా, భక్తులు హోమాలు, కుంకుమార్చన నిర్వహించారు. భూత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. నవాబ్‌పేట మండలం పర్వతాపూర్ మైసమ్మ ఆలయంలో అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనం ఇచ్చారు. ఆలయ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని మాతాగంగా భవాని ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మూసాపేట మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గామాతను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలతో పాటు కుంకుమార్చన చేశారు. గండీడ్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో దుర్గామాతను ప్రతిష్ఠంచి, బాలత్రిపురాసుందరీగా అలకంరించారు.