ప్రైవేట్ పాఠశాలకు పంపించం
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:41 PM
తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపించబోమని నాగర్‌కర్నూల్ జిల్లా, తెలకపల్లి మండల పరిధిలోని గౌతమ్‌పల్లి గ్రామస్థులు తీర్మానం చేసుకున్నారు.
- గౌతమ్‌పల్లి గ్రామస్థుల తీర్మానం
తెలకపల్లి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపించబోమని నాగర్‌కర్నూల్ జిల్లా, తెలకపల్లి మండల పరిధిలోని గౌతమ్‌పల్లి గ్రామస్థులు తీర్మానం చేసుకున్నారు. గౌతమ్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం తహసీల్దార్, ఎంఈవోలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని, చర్చించుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కగా పాఠాలు చెప్తున్నారని, ఈ సంవత్సరం ముగ్గురు విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో సీట్లు వచ్చాయని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని, వలంటీర్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జాకీర్ అలీ గ్రామస్థులను అభినందించారు. ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన ఉంటుందని, అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాలలో చేర్పించేందుకు ముందుకొచ్చిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు రమేశ్, శ్రీరాములను అభినందించారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు. అవసరమైతే మరో టీచర్‌ను నియమిస్తామని చెప్పారు. గౌతమ్‌పల్లిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అందించారు.