అమ్మ కడుపుపై కత్తెర గాట్లు
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:25 PM
నవ మాసాలు మోసి, సుఖ ప్రసవం కావలసిన తల్లుల కడుపుపై కత్తెర గాట్లు పడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి, 80 శాతం వరకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పెరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లు
ఏడాదిలో ప్రైవేటులో సిజేరియన్లు 3,323, సాధారణ కాన్పులు 1,609
విచ్చలవిడిగా ఫీజు వసూలు
అమలుకాని ఈ బర్త్ పోర్టల్
దృష్టి సారించని వైద్య ఆరోగ్యశాఖ
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం), డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నవ మాసాలు మోసి, సుఖ ప్రసవం కావలసిన తల్లుల కడుపుపై కత్తెర గాట్లు పడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి, 80 శాతం వరకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్నారు. సిజేరియన్ ఆపరేషన్లను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ బర్త్ ఫోర్టల్ జిల్లాలో అమలు కావడం లేదు.
నార్మల్ డెలివరీ చేస్తామని నమ్మబలికి..
జిల్లాలో ఒక జనరల్ ఆసుపత్రి, 3 కమ్యూనిటీ ఆసుపత్రులు, 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 210కి పైగా ప్రైవేటు నర్సింగ్ హోంలు, ఆసుపత్రులు ఉన్నాయి. జ నవరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,681 కాన్పులు జరిగాయి. అందులో సా ధారణ కాన్పులు 4,455 కాగా, సిజేరియన్ కాన్పు లు 3,226 ఉన్నాయి. ప్రై వేటు ఆసుపత్రుల్లో 4,932 కా న్పులు జరగగా, అందులో సాధారణ కాన్పులు 1,609 కాగా, సిజేరియన్ ఆపరేష న్లు 3,323 చేశా రు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత నార్మల్ డెలీవరీ చే స్తామని నమ్మబలికి, ఏదో కారణం చెప్పి, సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు.
కాసుల కోసం కక్కుర్తి..
ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. ఒక్కో సిజేరియన్ ఆపరేషన్‌కు ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. స్థాయి పెద్దగా ఉన్న ఆసుపత్రిలో రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు ఉండగా, చిన్న ఆసుపత్రుల్లో రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. అందులో మందులు, ల్యాబ్ ఫీజులు అదనంగా రూ. 10 వేల నుంచి రూ. 15వేల వరకు తీసుకుంటున్నారు.
అమలుకాని ఈ బర్త్ పోర్టల్
ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లను నిరోధించేందుకు, సాధారణ కాన్పులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ బర్త్ పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. ఆసుపత్రుల్లో ప్రతీ రోజు జరిగే కాన్పుల వివరాలను ఎప్పటికప్పుడు ఈ పోర్టల్‌లో నమోదు చేయాలి. పుట్టిన బిడ్డ వివరాలు, ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మాతా, శిశు మరణాలు వంటి అన్ని వివరాలు ఆ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాని జిల్లాల అమలు కావడం లేదు.
కొరవడిన పర్యవేక్షణ..
సిజేరియన్ కాన్పులపై జిల్లాలో పర్యవేక్షణ కొరవడింది. 80 నుంచి 100 శాతం సిజేరియన్లు చేస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి ఏ ఒక్క ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న దాఖలాలు రెండు, మూడేళ్లుగా లేవు. గత ఏడాది సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర యంత్రాంగం నోటీసులు జారీచేసినా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇది ఇలాగే కొనసాగితే మాతాశిశు మరణాలు కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.