స్కూల్ అసిస్టెంట్ పోస్టు జోనల్‌గా గుర్తించాలి
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:33 PM
గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మాదిరిగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టుగా గుర్తించాలని అప్పుడే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 సమస్య పూర్తిగా పరిష్కారం అవుతోందని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మాదిరిగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టుగా గుర్తించాలని అప్పుడే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 సమస్య పూర్తిగా పరిష్కారం అవుతోందని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 317లో నష్ట పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం చాలా మందికి న్యాయం జరిగిందన్నారు. మరికొంత మంది ఉన్నారని వారిని కూడా సొంత జిల్లాలకు పంపించాలన్నారు. స్పౌజ్‌కు సంబంధించి ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా మిగిలిపోయారని వారికి న్యాయం జరగాలంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టును జోనల్ పోస్టు చేయాలని, వచ్చే బదిలీల్లో అమలయ్యే విధంగా జీవో తీసుకరావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు పొంది 25ఏళ్లు గడిచిన వారు కూడా టెట్ రాయాలని, పాస్ కావాలని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే పార్లమెంట్‌లో సవరణ చేయాలని దీనికోసం పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నిరంతరం పోరాడుతున్నాడన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, ప్రధాన కార్యదర్శి భూపతిసింగ్, నాయకులు నాగిరెడ్డి, రాంచందర్‌నాయక్, ఆనంద్‌రెడ్డి, పెద్దిరెడ్డి పాల్గొన్నారు.