సరిహద్దు మాటున ఇసుక దందా
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:08 PM
ఏంది సారు ఇట్టావచ్చినవ్.. ఇది నీ బార్డర్ కాదు.. మీకు సంబంధమే లేదు.
- ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ఇసుక అక్రమ తయారీ
నవాబ్‌పేట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : ఏంది సారు ఇట్టావచ్చినవ్.. ఇది నీ బార్డర్ కాదు.. మీకు సంబంధమే లేదు. ఇది జడ్చర్ల పరిధికి వస్తోంది.. వెళ్లండి ఏమైనా ఉంటే మీ మండలంలో చూసుకో.. జడ్చర్ల పోలీసులు వచ్చినప్పుడు సార్ మీరు మమల్ని బెదిరిస్తే బెదరం నీ ఇష్టముంటే కేసు చేసుకో.. మాది నవాబ్‌పేట మండలం పరిధికి వస్తుంది. ఇది పోలీస్ అధికారులకు ఎదురయ్యో సమస్య. జడ్చర్ల, నవాబ్‌పేట మండలాల సరిహద్దు మాటున ఉన్న ఉదండాపూర్ రిజర్వాయర్ ఇసుక అక్రమ రవాణకు అడ్డాగా మారింది. దీంతో ఇసుక వ్యాపారులు రాత్రీ పగలు తేడా లేకుండా ఇసుక తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్, ఒల్లూర్, ఖానాపూర్, నవాబ్‌పేట మండలంలోని కారుకొండ, సిద్దోటం, తీగలపల్లి గ్రామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రిజర్వాయర్‌లో వివిధ గ్రామాలకు చెందిన ఇసుక వ్యాపారులు రిజర్వాయర్ గుంతల్లో నీరు ఉండటంతో టిప్పర్ల ద్వారా మట్టి తీసుకొచ్చి ఇక్కడ కృత్రిమ ఇసుక తయారు చేసి జడ్చర్ల, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల పోలీసులు వస్తే ఇది మీ పరిధి కాదు నవాబ్‌పేటకు వస్తోందని చెప్పి వారిని తిప్పి పంపుతున్నారని, నవాబ్‌పేట పోలీసులు వస్తే జడ్చర్ల పోలీసుల పరిధి అంటూ దాట వేస్తున్నట్టు సమాచారం. దీంతో రెండు మండలాల పోలీసులు సరిహద్దు ప్రాంతం కావడంతో మనకెందుకులే అన్నట్టు వెనక్కి తగ్గడంతో ఇసుక వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
ఇక నవాబ్‌పేట మండలంలో ప్రధానంగా ఉన్న దుందుభీ వాగు మండలంలోని గురుకుంట సమీపంలో ఉన్న సోమసముద్రం నుంచి మొదలై అమ్మాపూర్, లోకిరేవు, చౌటపల్లి, ఇప్పటూర్, కారూర్ వరకు పది కిలో మీటర్లు మండలంలో పారుతుంది. ఇక వర్షాకాలంలో పెద్ద ఎత్తున వాగు పొంగి పొర్లుతుంది. దీంతో భారీగా ఇసుక వాగు పరిసర ప్రాంతాల్లో వచ్చి చేరడంతో ఇసుక అక్రమార్కులు ఫిల్టర్ చేసి హైదరాబాద్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, నవాబ్‌పేట ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
చెక్‌డ్యాంలు ధ్వంసం..
2009లో డాక్టర్ మల్లురవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించారు. అప్పటి నుంచి వాగు పరిసర ప్రాంత రైతులకు ఈ చెక్‌డ్యాంలు వరంగా మారాయి. కానీ కొంతకాలంగా అక్రమార్కులు ఇసుకను ఫిల్టర్ చేయడంతో చెక్‌డ్యాంలు కూలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దుందుభీ వాగు సైతం నవాబ్‌పేట, రాజాపూర్ మండలాల సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులకు సమస్యగా మారింది.
చర్యలు తప్పవు.
ఇసుక తరలింపు నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. రాత్రివేళ గస్తీ నిర్వహించి ట్రాక్టర్లు, టిప్పర్లను సీజ్ చేస్తున్నాం. ఇసుక తరలింపు సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయవచ్చు.
నవాబ్‌పేట ఎస్‌ఐ విక్రం