Share News

ఇసుక మాఫియా చేతిలో దుందుభీ బందీ

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:02 PM

అచ్చంపేట నియోజకవర్గంలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది. అక్కడ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇసుక మాఫియా చేతిలో దుందుభీ బందీ
మొల్గర, ఉప్పనుంతల మధ్య ఉన్న వాగు వద్ద ఎక్స్‌కవేటర్‌తో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతున్న దృశ్యం

- రోజుకు వంద టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా

- రెవెన్యూ, పోలీసుల కనుసన్నల్లో నడుస్తున్న వ్యవహారం

- వంగూరు మండలం ఉల్పర, రామగిరి, పోతిరెడ్డిపల్లి వద్ద అనధికారికంగా ఇసుక రీచ్‌లు

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట నియోజకవర్గంలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది. అక్కడ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి రాజకీయ, ఆర్థిక పలుకుబడికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కూడా దాసోహం కావడంతో ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతోంది. దుందుభీ నది ప్రవహిస్తున్న ప్రాంతాలల్లో గ్రామస్థుల మధ్య కూడా విభేదాలు సృష్టించి అందిన కాడికి దోచుకునే పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుందుభీ పరివాహక ప్రాంతాల్లో విశేషమేమిటంటే ఇసుక అక్రమ రవాణా విషయంలో గతంలో పరస్పరంగా విమర్శలు సంధించుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కూడా నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరమైన పరిణామంగా మారింది. తహసీల్దార్‌ కార్యాలయాలు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో కూడా అనేక ఫిర్యాదులు అందినా కనీస స్పందన లేకపోవడంతో దుందుభీ నదిలో ఇసుకపై వ్యవహారం తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా మారింది. అనుమతుల పేరిట దుందుభీని కొల్లగొడుతున్న ఇసుక మాఫియా సీఎం తరపు బంధువులను కూడా బద్నాం చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. దుందుభీ నుంచి అక్రమంగా ఇసుక రవాణా వ్యవహారం బహిరంగ రహస్యంగా మారి రెవెన్యూ, పోలీసులకు కాసుల వర్షం కురిసిస్తున్న ఉన్నతాధికారులు కూడా నోరు మెదపకపోవడం దుందుభీ నది పరివాహక ప్రాంత ప్రజల్లో హాస్యాస్పదంగా మారింది. ఉన్నతాధికారులు తలచుకుంటే అక్రమ రవాణాను అడ్డుకోవడం అసాధ్యమా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. దుందుభీ నుంచి ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయని అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కలెక్టర్‌, ఎస్పీ తదితర జిల్లా అధికారులు ప్రజలు ఫిర్యాదు చేసిన ప్రాంతాలకు కూడా వెళ్లకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఉల్పర, పోతిరెడ్డిపల్లి, రామగిరి ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను అక్రమంగా ఏర్పాటు చేసి రోజుకు వంద టిప్పర్ల ఇసుకను హైదరాబాద్‌కు తరలించడం వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని తెలుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌, ఉప్పునుంతల మండలాల్లో సీఎం బంధువులమంటూ పేర్కొని అధికారులకు మామూళ్లు ఇవ్వడం తమ ఇసుక మాఫియా సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్న అధికారపార్టీ నేతలు ఆ ప్రాంతాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారు. నది పరివాహక ప్రాంతం నుంచి ట్రాక్టర్లల్లో ఇసుక నింపి తమ డంప్‌లకు తెచ్చుకోవడం ద్వారా వారికి తృణమో పణమో అప్పజేప్తూ గ్రామస్థులను గుప్పిట్లో పెట్టుకున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మా భూములు పోయాయి. మేము ఇసుక కాంట్రాక్టర్లకు ట్రాక్టర్ల ద్వారా వారికి సహకరిస్తూ రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నామంటూ చెప్తున్న గ్రామస్థులను ఇసుకాసురులు అక్కడ వెళ్లి ఇసుక అక్రమ రవాణాను వ్యతిరేకించే శక్తులపై ఉసిగొల్పుతున్నారు. ఉల్పర, రామగిరి నుంచి రోజుకు వంద టిప్పర్లలో ఇసుక అక్రమంగా అచ్చంపేట, హైదరాబాద్‌కు తరలి వెళ్తుండడంతో రహదారులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. దుందుభీ పరివాహక ప్రాంతాల ప్రజలు అక్కడ ఉన్న రహదారులపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం.

Updated Date - Oct 26 , 2025 | 11:02 PM