చివరి రోజు అదే జోరు
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:28 PM
పంచాయతీ ఎన్నికల రెండోవిడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలోనూ చివరి రోజు అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. రెండో రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు రాగా, మంగళవారం తక్కువగానే ఉంటాయని భావించారు.
అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్లు
ముగిసిన రెండో విడత.. నేటి నుంచి మూడో విడత
నేడు మొదటి విడతకు ఉపసంహరణ
పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన
మహబూబ్‌నగర్, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల రెండోవిడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలోనూ చివరి రోజు అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. రెండో రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు రాగా, మంగళవారం తక్కువగానే ఉంటాయని భావించారు. కానీ రెండో రోజుకన్నా చివరి రోజే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. రాత్రి క్యూలో ఉన్న వాళ్ళకు టోకెన్లు ఇచ్చి, బయటకు పంపించారు. టోకెన్ల ప్రకారం పది మంది చొప్పున లోపలికి అనుమతించారు. కొందరు బయటకు వచ్చి టీ, స్నాక్స్ తిని మళ్లీ నామినేషన్ వేసేందుకు వెళ్లారు. నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు.
నేటి నుంచి మూడో విడత
ఎన్నికల రెండు విడుతల నామినేషన్ల స్వీకరణ ముగిసిం ది. బుధవారం నుంచి ఈ నెల 5 వరకు మూడో విడత మం డలాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలోని జ డ్చర్ల, మూసాపేట, అడ్డాకుల, భూత్పూరు, బాలానగర్ మం డలాలకు సంబంధించి 133 గ్రామ పంచాయతీలు, 1,152 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
నేడు ఉపసంహరణ
మొదటి విడత ఎన్నికల నామినేషన్ల నేడు ఉపసంహరణ జరుగనుంది. 5 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులకు అక్షరమాల ప్రకారం బ్యాలెట్‌లో గుర్తులను కేటాయిస్తారు. ఈనెల 11న మొదటి విడత గ్రామాలలో ఓటింగ్ జరుగనుంది. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులను తప్పించేందుకు నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టారు. బుజ్జగింపులు, బేరసారాలు, బెదిరింపులు కొనసాగుతున్నాయి. కొందరు అభ్యర్థులు మాత్రం ఉపసంహరణ చేయిస్తారన్న భయంతో ఇప్పటికే తమ ఫోన్‌లు స్విచ్‌ఆ్‌ఫ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.