గ్రామీణ రోడ్లు బురదమయం
ABN , Publish Date - Jun 19 , 2025 | 10:49 PM
పల్లెల్లో పరిశుభ్రత లోపించి పారిశుధ్య సమస్యలు పెరిగిపోయాయి.
- పడకేసిన పరిశుభ్రత..
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
మిడ్జిల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : పల్లెల్లో పరిశుభ్రత లోపించి పారిశుధ్య సమస్యలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో చెత్తాచెదారం పేరుకుపోయి, అంతర్గత రోడ్లు బురదమయం కావడంతో ప్రజారోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నా.. సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో పల్లె ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు లేకపోవడం, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించడంతో వారు పూర్తి స్థాయిలో పారిశుధ్యంపై దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో మండలంలోని కొత్తూరు, వెలుగొమ్ముల, చిలువేరు గ్రామాలతో పాటు పలు తండాల్లో చిన్నపాటి వర్షానికే అంతర్గత రోడ్లు మొత్తం బురదమయంగా మారి ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది.
అధ్వానం ప్రత్యేకాధికారుల పాలన..
గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రామ పంచాయతీల్లో పనులు చేయించినా తాము చేసిన పనులకు బిల్లులు రావడంలేదని ప్రత్యేకాధికారులు లోలోపల ఆవేదన చెందుతున్నారు. దీంతో వారు కొత్త పనులు, మరమ్మతు చేయించాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలో గ్రామాలు అధ్వానంగా మారుతున్నాయి.
చెత్తసేకరణలో జాప్యం..
గ్రామ పంచాయతీల్లో చెత్తసేకరణకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు సిబ్బందిని ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి నిత్యం చెత్తసేకరణ చేపట్టడం లేదు. ట్రాక్టర్లలో డిజిల్ పోసేందుకు డబ్బులు లేవని గ్రామ పంచాయతీ అధికారులు బాహటంగానే చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడికక్కడే చెత్తాచెదారం పేరుకుపోయి పరిశుభ్రత లోపించింది. దీంతో ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ప్రజలు అంటువ్యాధులు, విషజ్వరాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. వర్షపు నీరు, మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టి ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా సంబంధిత అధికారులు సకాలంలో చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.