108 సిబ్బంది పాత్ర కీలకం : డీఎస్పీ
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:53 PM
ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించినా తక్షణమే స్పందించి వారి ప్రాణాలు రక్షించడంలో 108 సిబ్బంది పాత్ర కీలకమని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం), నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించినా తక్షణమే స్పందించి వారి ప్రాణాలు రక్షించడంలో 108 సిబ్బంది పాత్ర కీలకమని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జీవీకే ఈఎంఆర్‌ఐ 108 అంబులెన్స్‌లలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలట్‌లకు శనివారం జనరల్ ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన పునశ్చరణ శిక్షణ కార్యక్రమానికి ఆయనతో పాటు మోటర్ వేహికిల్ ఇన్స్‌పెక్టర్ వాసు దేవర హాజరై మాట్లాడారు. ఏదైనా ప్రమాదం జరిగితే గుర్తొచ్చేది 108 అంబులెన్స్ అని, అలాంటి సందర్భంలో ఎవ్వరు ఫోన్ చేసినా.. తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి సకాలంలో వెళ్లాలని, వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి జాయిన్ చేసే వరకు అక్కడే ఉంచి అన్ని పనులు చూడాలన్నారు. అదే విధంగా అంబులెన్స్‌లలో ప్రథమ చికిత్స కిట్లు, ఇతర వైద్య పరికరాలు, వస్తువులను ఉండేలా చూసుకోవాలన్నారు. వాహనం ఫిట్‌నెస్ కూడా తరచూ చూసుకోవాలని సూచించారు. ఈఎంఎల్‌సి డిపార్ట్‌మెంట్ ఇన్‌స్ట్రక్టర్ అరవింద, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, జిల్లా కోఆర్డినేటర్లు రత్నం, ఉదయ్‌కుమార్, ఈఎంటీలు, పైలెట్లు పాల్గొన్నారు.