బిల్లుల కోసం అడ్డదారులు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:08 PM
: మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ పనులను దక్కించుకున్న శ్రీసాయి ఏజెన్సీ పెండింగ్ బిల్లుల కోసం అడ్డదారులు తొక్కుతోంది. ఆ ఏజెన్సీ పని తీరు బాగోలేదని 2022లో నివేదిక ఇవ్వడంతో, అందుకు బిల్లులు సగమే వచ్చాయి.
జనరల్ ఆస్పత్రిలోని శ్రీసాయి ఏజెన్సీ నిర్వాకం
శానిటేషన్, సెక్యూరిటీ పనితీరు బాగోలేదని అప్పటి సూపరింటెండెంట్ నివేదిక
మూడేళ్లుగా రూ.48 లక్షలు పెండింగ్
వాటి కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్న ఓ ప్రజాప్రతినిధి
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం) సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ పనులను దక్కించుకున్న శ్రీసాయి ఏజెన్సీ పెండింగ్ బిల్లుల కోసం అడ్డదారులు తొక్కుతోంది. ఆ ఏజెన్సీ పని తీరు బాగోలేదని 2022లో నివేదిక ఇవ్వడంతో, అందుకు బిల్లులు సగమే వచ్చాయి. ఇంకా రూ.48 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదివరకు ఉన్న ముగ్గురు సూపరింటెండెంట్ ఆ బిల్లులు చేయడానికి సాహసం చేయలేదు. ఇప్పుడు ఆ బిల్లులు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
రూ.48 లక్షలు పెండింగ్..
2022 జూన్‌లో ఆస్పత్రిలోని శానిటేషన్, సెక్యూరిటీ టెండరును శ్రీసాయి ఏజెన్సీ దక్కించుకుంది. వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం నెల నెలా బిల్లులను మంజూరు చేస్తుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో శానిటేషన్ పనితీరు బాగోలేదని అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దాంతో వారికి ఆ మూడు నెలల కు కలిపి తక్కువగా రూ.48 లక్షలు బిల్లులు మాత్రమే వ చ్చాయి.
బిల్లులు చేయాలని ఒత్తిళ్లు..
పెండింగ్‌లో రూ.48 లక్షల బిల్లులు చేయాలని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆస్పత్రి అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారని తెలుస్తోంది. సీఎం స్థాయి వరకు తమకు పలుకుబడి ఉందని, బిల్లులు చేస్తే పర్సంటేజీ ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారని సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు బిల్లులు చేయాలని లెటర్ ప్యాడ్‌పై రాసి కలెక్టర్‌కు పంపించినట్లు తెలిసింది. గతంలో ఉన్న సూపరింటెండెంట్ తప్ప తాము బిల్లులు చేయడానికి రాదని, అలా చేస్తే చిక్కుల్లో పడతామని చెప్పారని తెలుస్తోంది.
బిల్లులు అయితేనే టెండరుకు అవకాశం
శ్రీసాయి ఏజెన్సీ టెండరు కాలపరిమితి ఈ ఏడాది జూన్ 22 వరకు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మౌఖిక ఆదేశాలతోనే కొనసాగుతోంది. మళ్లీ టెండరు తమకే దక్కాలని ఆ ఏజెన్సీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మళ్లీ టెండరులో పాల్గొనాలంటే ఎలాంటి ఆరోపణలు, బిల్లులు పెండింగ్ ఉండొద్దనే నిబంధనలు ఉండటంతో ఎలాగైనా బిల్లలు చేయించుకోవాలని ఏజెన్సీ అడ్డదారులు తొక్కుతోంది. తాజాగా ఈ బిల్లులు చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది.