Share News

వరి కోతలు షురూ

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:33 PM

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంటను రైతులు రెట్టింపు సాగు చేశారు.

వరి కోతలు షురూ
కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రైవేట్‌ వ్యాపారస్థులు

- ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

- వర్షం భయంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు

భూత్పూర్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంటను రైతులు రెట్టింపు సాగు చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఎడతెరఫీ లేకుంగా ఏకధాటిగా వర్షాలు కురిసాయి. ఈ క్రమంలో పంట కోతకు రావడం, వర్షం తగ్గుముఖం పట్టడంతో వరి కోతలు షురు అయ్యాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ ఏడాది 17 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రతీ రోజు వాతావరణంలో జరుగుతున్న మార్పును చూసి రైతులు పంటను కోస్తున్నారు. అయితే కోసిన పచ్చి ధాన్యాన్ని క్వింటాలుకు (సన్నరకం) రూ.2050, (దొడ్డురకం) రూ.1800 ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. అదే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాలుకు సన్నరకం వరికి రూ.2,360, దొడ్డురకం రూ.2340 అమ్ముకోవాలి. అయితే తేమ శాతం తగ్గిన వాటికి ఆ ధర ఉంటుంది. ప్రైవేట్‌ వ్యాపారస్థులకు అమ్మే వరికి తేమశాతంతో సంబంధం ఉండదు. తూకం దగ్గర క్వింటాలుకు 2 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే ప్రైవేటు వ్యాపారులు రైతులను మాయ మాటలు చెప్పి వర్షాలు కురిస్తే పంట వాన పాలవుతుందని చెప్పి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదిలా ఉంటే వరి కోత యంత్రాల వారు ప్రస్థుతం వర్షాలు పడ్డాయి మిషన్లు పోవడం కష్టమని, గంటకు రూ.2800 నుంచి రూ.3 వేలు ఇస్తేనే వరి కోతకు యంత్రాలు పంపిస్తామని చెప్పడంతో గత్యంతరం లేక రైతులు వారు అడిగినంత ముట్ట చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే ప్రైవేటు వ్యాపారస్థుల ఆగడాలు తగ్గిపోతాయని రైతులు అభిప్రాయ పడుతున్నారు.

త్వరలో ప్రారంభిస్తాం..

వరి పంటను కొనుగోలు చేయడానికి త్వరలో ఏర్పాట్లు చేస్తున్నాము. రైతులు తొందర పడి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవద్దు. తూకాల్లో మోసం జరిగే అవకాశం ఉంది. రెండు, మూడు రోజులు ఆగితే ప్రభుత్వమే కల్లాల్లో వచ్చి కొనుగోలు చేస్తోంది.

మురళీధర్‌, ఏవో, భూత్పూర్‌

Updated Date - Nov 02 , 2025 | 10:33 PM