రిజర్వేషన్ పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:18 PM
గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లు సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్
ఎర్రవల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లు సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ అన్నారు. ఎర్రవల్లిలోని క్లస్టర్ 1, 2 నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా పంచాయతీల ఓటరు జాబితాను పరిశీలించి, పోటీ చేసే అభ్యర్థులు, పూరించాల్సిన వివిధ దరఖాస్తులను నామినేషన్ వేసేందుకు అవసరమైన ఇతర సామాగ్రిని అధికారులు సిద్ధంగా ఉంచుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు తగిన సహకారం అందించాలని హెల్ప్‌డెస్క్ సిబ్బందికి సూచించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఉన్న అన్ని ధ్రువీకరణ పత్రాలను స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళి పత్రాలను విధిగా నామినేషన్ వేసిన వారికి అందజేయాలన్నారు. సాయంత్రం 5గంటల లోపు నామినేషన్ కేంద్రం లోపల ఉన్న వారితో మాత్రమే స్వీకరించాలని, నిర్దేశిత సమయం మించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించవద్దని పేర్కొన్నారు. ఈయన వెంట ఎర్రవల్లి తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో సాయిద్‌ఖాన్ ఉన్నారు.