Share News

రిజర్వేషన్లు రెడీ

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:27 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను.. కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం రద్దు చేసింది.

రిజర్వేషన్లు రెడీ
పోల్కంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

పంచాయతీ ఎన్నికలకు మిగిలింది నోటిఫికేషనే

నేడో.. రేపో వెలువడనున్న షెడ్యూల్‌

జిల్లాలో 423 సర్పంచ్‌ స్థానాలు

ఎస్సీ, ఎస్టీ స్థానాలు పాతవే.. బీసీల స్థానంలో పెరిగిన జనరల్‌ సీట్లు

రిజర్వేషన్ల ఖరారుతో వేడెక్కిన పల్లె రాజకీయం

మహబూబ్‌నగర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను.. కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం రద్దు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న కోర్టు నిర్ణయం మేరకు బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ తాజాగా పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. సర్పంచ్‌తోపాటు వార్డు స భ్యులకు రిజర్వేషన్లు పైనల్‌ చేస్తూ సోమవారం కలెక్టర్‌ విజయేందిర బోయి గెజిట్‌ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ స్థానాలలో పెద్దగా మార్పులేకపోగా, గతంలో ఎస్సీ, ఎస్టీ జనరల్‌ ఉన్నచోట కొన్ని మహిళలకు రిజర్వు అయ్యాయి. బీసీలకు కేటాయించిన చోటనే చాలా స్థానాలు మారిపోయాయి. వాటి స్థానంలో జనరల్‌కు కేటాయించారు. రిజర్వేషన్లు ఫైనల్‌ కావడంతో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడమే మిగిలింది. నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం అనంతరం ఏ క్షణంలోనైనా ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్‌ వెలువడితే డిసెంబరు 20-25 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

రిజర్వేషన్లు ఇలా

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 423 సర్పంచ్‌ స్థానాలున్నాయి. వీటిలో జనరల్‌కు 41.84 శాతం, బీసీలకు 20.33 శాతం, ఎస్సీలకు 14.18 శాతం, ఎస్టీలకు 23.64 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఎస్టీ జనాభా వంద శాతం ఉన్న పంచాయతీలలో మొత్తం ఎస్టీలకే రిజర్వ్‌ కావడంతో ఎస్టీ రిజర్వేషన్‌ శాతం పెరిగింది. జిల్లాలో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు 76 ఉన్నాయి. ఇక మిగిలిన పంచాయతీలలో ఎస్టీ జనాభా ఆధారంగా 24 పంచాయతీలు వారికి రిజర్వు అయ్యాయి. మొత్తంగా 100 పంచాయతీలు ఎస్టీలకు దక్కగా, అందులో 46 మహిళలకు, 54 జనరల్‌కు అలాట్‌ య్యాయి. ఇక బీసీలకు 86 స్థానాలు దక్కాయి. అందులో మహిళలకు 39, జనరల్‌ 47 స్థానాలు వచ్చాయి. ఎస్సీలకు 60 స్థానాలు కాగా, అందులో మహిళలకు 26 స్థానాలు, జనరల్‌కు 36 స్థానాలు దక్కాయి. జనరల్‌ కేటగిరిలో 177 పంచాయతీలు రిజర్వ్‌ కాగా, అందులో 84 మహిళలకు, 93 జనరల్‌ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో 195 స్థానాలు మహిళలకు, 228 స్థానాలు జనరల్‌కు కేటాయించారు.

జిల్లాలో 3,674 వార్డు స్థానాలు ఉన్నాయి. అందులో మహిళలకు 1,591, జనరల్‌కు 2,083 స్థానాలు కేటాయించారు. ఎస్టీలకు 803(21.85 శాతం) వార్డులు అలాట్‌ చేయగా, అందులో 564 స్థానాలు వంద శాతం ఎస్టీ జనాభావి ఉన్నాయి. ఎస్సీలకు 511(13.90 శాతం), బీసీలకు 1591(21.91 శాతం), జనరల్‌కు 2,083(42.32 శాతం) రిజర్వు అయ్యాయి.

ఆశావహుల హల్‌చల్‌

సర్పంచ్‌, వార్డుమెంబర్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో వాట్సాప్‌ గ్రూపుల్లో పోటీదారులు హల్‌చల్‌ చేస్తున్నారు. మద్దతుదారులు ఫలానా అభ్యర్థి పోటీ చేస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. సర్పంచ్‌ రిజర్వేషన్‌లలో అవకాశం కోల్పోయిన ఆశావహుల వద్దకు వెళ్లి, ఎంపీటీసీ ఎన్నికల్లో తన మద్దతు నీకేనని, ఇప్పుడు సర్పంచ్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారు. గ్రామాల్లో రాజకీయం వేడెక్కడంతో వాతావరణం మారిపోయింది.

Updated Date - Nov 24 , 2025 | 11:27 PM