Share News

అద్దె తడిసి మోపెడు

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:35 PM

ఉమ్మడి జిల్లాలో మైనారిటీ గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ప్రభుత్వానికి రెంటు భారం తడిసిమోపెడవుతోంది. మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలను ప్రారంభించింది.

అద్దె తడిసి మోపెడు
బోయపల్లి శివారులో 70 శాతం పనులు పూర్తయిన మైనారిటీ గురుకుల భవన సముదాయం

కిరాయి భవనాల్లో మైనారిటీ గురుకులాలు

ఉమ్మడి జిల్లాలో 20 బాల, బాలికల విద్యాలయాలు

నెలకు రూ.52 లక్షల అద్దె.. ఏడాదికి రూ.6.29 కోట్లు

నాలుగేళ్లుగా నిర్మాణంలోనే భవనాలు

బోయపల్లి సమీపంలో 70 శాతం పనులు పూర్తి

అక్టోబరులో ప్రారంభించేందుకు కసరత్తు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో మైనారిటీ గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ప్రభుత్వానికి రెంటు భారం తడిసిమోపెడవుతోంది. మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలను ప్రారంభించింది. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత ఇంటర్‌ వరకు కొన్ని పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం బాల, బాలికల గురుకులాలు 20 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారుగా 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ గురుకులాలన్నీ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. నెలకు వీటి అద్దె రూపంలో రూ.52.43 లక్షలను చెల్లిస్తున్నారు. సొంత భవనాలకు ప్రభుత్వం స్థలం కేటాయించి నిధులు విడుదల చేసినా అవి నాలుగైదు సంవత్సరాలుగా నిర్మాణంలోనే ఉన్నాయి. దాంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.6.29 కోట్లు అద్దెల రూపంలో భారం పడుతోంది.

కొనసా..గుతున్న నిర్మాణాలు

ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు 6 మైనారిటీ గురుకులాల భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం 2016లో ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో గురుకులానికి రూ.20 కోట్ల చొప్పున రూ.120 కోట్లు మంజూరు చేసింది. బోయపల్లి శివారులో బాలికల గురుకుల భవన నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 20 19లో పనులు ప్రారంభించా రు. ఈ భవనం పనులు 70 శాతానికిపైగానే పూ ర్తయ్యాయి. వీరన్నపేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కాలనీ వద్ద 2 బాలికలు, 3 బాలుర గురుకుల పాఠశాలల భవనాలకు 15 ఎకరాల స్థలం కేటాయించి 2022లో పనులు మొదలు పెట్టారు. ఈ 5 భవనాల నిర్మాణ పనులు పిల్లర్ల వరకు చేపట్టి, వదిలేశారు. అదేవిధంగా జడ్చర్లలో ఒకటి, దేవరకద్రలో 2 గురుకులాల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తిలో ఒక్కో గురుకులం, వనపర్తి-2, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఒక్కో భవనానికి స్థలాలు కేటాయించారు. పనులు ఎప్పుడు మొదలు పెడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అద్దెలు చెల్లించలేదని తాళాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మైనారిటీ గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గత ఏడాది అక్టోబరు వరకు 11 నెలల అద్దె పేరుకపోవడంతో యజమానులు పలు చోట్ల భవనాలకు తాళాలు వేశారు. జిల్లా కేంద్రం న్యూటౌన్‌లో ఉన్న మైనారిటీ బాలుర-2 గురుకులంతో పాటు పలు గురుకులాలకు తాళాలు వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు.

త్వరలో బోయపల్లి గురుకులం ప్రారంభిస్తాం..

జిల్లా కేంద్రంలోని బోయపల్లి వద్ద నిర్మిస్తున్న బాలికల గురుకుల భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో 5 నెలల్లో భవనంలో అందుబాటులోకి వస్తుంది. అక్టోబరు 15లోగా రెండు పాఠశాలలు, ఒక జూనియర్‌ కళాశాలలో తరగతులు ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటికే కలెక్టర్‌ పనులు పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవి అందుబాటులోకి వస్తే అద్దె భారం తగ్గుతుంది.

-శంకరాచారి, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి

Updated Date - Sep 20 , 2025 | 11:35 PM