రికార్డు స్థాయిలో వరద
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:07 PM
దిగువ కృష్ణా బేసిన్‌కు వరద ఇంకా వస్తూనే ఉంది. ఈ బేసిన్‌కు సాధారంగా జూన్ చివరి వారం నుంచి వరద ప్రారంభమై.. సెప్టెంబరు వరకు ఈ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో కొనసాగుతుంది. ఎప్పుడో ఒక సంవత్సరం అక్టోబరులో కూడా స్వల్పంగా వరద వస్తుంది.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ఇంకా కొనసాగుతోంది..
వరద సమయంలోనే వానాకాలం పంట చేతికి..
యాసంగిలో వారబందీ వద్దంటున్న ఆయకట్టు రైతులు
సమర్థవంతంగా వినియోగిస్తే.. తాగు, సాగునీటికి ఢోకా లేనట్లే..
మహబూబ్‌నగర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దిగువ కృష్ణా బేసిన్‌కు వరద ఇంకా వస్తూనే ఉంది. ఈ బేసిన్‌కు సాధారంగా జూన్ చివరి వారం నుంచి వరద ప్రారంభమై.. సెప్టెంబరు వరకు ఈ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో కొనసాగుతుంది. ఎప్పుడో ఒక సంవత్సరం అక్టోబరులో కూడా స్వల్పంగా వరద వస్తుంది. వరద ఆగిపోయే సమయానికి వానాకాలం పంటలు రాష్ట్రంలో కోత దశలో ఉంటాయి. కానీ ఈ ఏడాది మే మూడో వారంలో ప్రారంభమైన వర్షాలు, వరద నవంబరు రెండోవారం గడుస్తున్నా కొనసాగుతున్నాయి. ఓ వైపు చలి ప్రారంభమైనా వరద మాత్రం ఆగడం లేదు. ఎగువన కర్ణాటకలో రోడ్ కం బ్యారేజీలు కట్టినప్పటి నుంచి కనీసం సీపేజ్ కింద కూడా చుక్కనీరు జూరాల వరకు రాని పరిస్థితుల్లో ఏటా వేసవిలో తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాల్సిన దుస్థితి నెలకొంది. గడిచిన రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండగా, ఈ ఏడాది సమర్థవంతంగా నీటి వినియోగం చేస్తే వేసవి తాగునీటి అవసరాలకు నారాయణపూర్ రిజర్వాయర్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, ఆయకట్టు సాగునీటికి కూడా ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
18 వేల క్యూసెక్కుల వరద
ప్రస్తుతం జూరాలకు 18 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అంటే రోజుకు 1.80 టీఎంసీ నీరు వస్తున్నట్లే. ఈ నెలాఖరు వరకు వరద కొనసాగినా.. ఇప్పటికే వానాకాలం పంటలు చేతికి వచ్చాయి. దాంతో యాసంగికి వారబందీ లేకుండా నిర్దేశించిన డిస్ర్టిబ్యూటరీ వరకు నీరు ఇచ్చినా.. అధిక వర్షాలతో వానాకాలం దిగుబడి నష్టపోయిన తమకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. నీటి పొదుపు ఇప్పటి నుంచే అమలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు తమ దగ్గరకు వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని, నీరు విడుదల చేయడం వల్ల యాసంగిలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నీళ్లొచ్చినా నిష్ఫలం..
దిగువ కృష్ణా బేసిన్‌లో తెలంగాణలో వచ్చే మొదటి ప్రాజెక్టు జూరాల. ఆ తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో తెలంగాణ రైతాంగం సాగు, తాగు నీటిని పొందుతోంది. కృష్ణా నదికి సాధారణ వరద రోజులు 90 కాగా.. ఈసారి దాదాపు 160 రోజులకుపైగా వరద వచ్చింది. జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా 1, 2, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు సంబంధించిన రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. చెరువులు స్థానికంగా కురిసిన వర్షాలకే జలకళను సంతరించుకున్నాయి. అయితే ఈ ఏడాది అనుకున్నంతగా వరద నీటిని లిఫ్ట్ చేసి నిలువ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. స్టోరేజీ రిజర్వాయర్లు సరిపడా లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. వరద వస్తున్న రోజుల్లో లిఫ్టుల్లో మోటార్లను నిలిపివేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కల్వకుర్తి కింద కేవలం 4 టీఎంల లోపు నిల్వ సామర్థ్యం ఉండటం, భీమా కింద శంకర సముద్రం పూర్తి కాకపోవడం, నెట్టెంపాడు కింద ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీల కారణంగా 4 టీఎంసీలకు గాను, కేవలం 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడం, ప్యాకేజీ 99, 100లు పూర్తి కాకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. కోయిల్‌సాగర్ కింద అదనపు ఆయకట్టు స్థిరీకరణ కాకపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదలు భారీగా వచ్చి భూగర్భ జలాలు పెరగడంతో కొంత మేలని చెప్పవచ్చు. పలుచోట్ల భూములు జౌకు ఎక్కడంతో ఈ ఏడాది యాసంగి పంటలకు కూడా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవడం ఊరట కలిగిస్తోంది.
మెజారిటీ నీరు కడలిపాలు..
ఏపీ వైపు శ్రీశైలం నీటిని చిత్తూరు జిల్లా కుప్పం వరకు తలిస్తుండగా.. తెలంగాణ వైపు కనీసం కల్వకుర్తి ఎత్తిపోతల చివరి ఆయకట్టుకు వరకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది భారీగా వరద వచ్చినప్పటికీ మెజారిటీ నీరు సముద్రంలో కలిసిపోయింది. దిగువ కృష్ణా బేసిన్‌లోని ఆలమట్టి ప్రాజెక్టుకు ఈ ఏడాది 776.28 టీఎంసీల వరద వచ్చింది. ఆ తర్వాత నారాయణపూర్‌కు 776.65 టీఎంసీలు, భీమాపై ఉన్న ఉజ్జయినికి 188.79 టీఎంసీలు, జూరాలకు 1,595.51 టీఎంసీల వరద వచ్చింది. ఆ తర్వాత తుంగభద్ర డ్యాంకు 411.39 టీఎంసీలు రాగా.. శ్రీశైలానికి అత్యధికంగా 2,297 టీఎంసీల నీరు వచ్చింది. నాగార్జునసాగర్‌కు 1,786 టీఎంసీలు, పులిచింతలకు 1,491 టీఎంసీలు వచ్చింది. కృష్ణా డెల్టా సిస్టంకు 1,767 టీఎంసీల వరద రాగా.. సుముద్రంలో దాదాపు 1,700 పౖచిలుకు టీఎంసీల నీరు కలిసిపోయింది. అత్యధికంగా నీటి వినియోగం ఈ ఏడాది శ్రీశైలం వద్ద జరిగిది. సుమారు 500 టీఎంసీలకు పైగా నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీనివా, కల్వకుర్తి పథకాలకు తరలించారు. ఏపీవైపు సుమారు 496 కిలో మీటర్ల దూరంలో కుప్పం వరకు కృష్ణానీటిని తరలించారు. అలాగే ఈ ఏడాది జల విద్యుత్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. జూన్‌లో ప్రారంభమైన విద్యుదుత్పత్తి జూరాల నుంచి నాగార్జునసాగర్ వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే శ్రీశైలంతో పోటీపడి విద్యుదుత్పత్తి చేయడం వల్ల వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయనే పలువురు అభిప్రాయపడుతున్నారు.