Share News

చివరి విడతకు సిద్ధం

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:57 PM

పల్లె పోరులో చివరి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మూడు విడతలుగా నిర్వహించ తలపెట్టిన ఎన్నికల్లో మొదటి విడత 11వ తేదీన, రెండో విడత 14వ తేదీన పూర్తి కాగా, నేడు బుధవారం చివరి విడత నిర్వహించనున్నారు.

చివరి విడతకు సిద్ధం
భూత్పూర్‌లో సామగ్రిని సరి చూసుకుంటున్న సిబ్బంది

ఉమ్మడి జిల్లాలో నేడు 504 పంచాయతీలు, 4,020 వార్డులకు పోలింగ్‌

52 సర్పంచులు, 945 వార్డు స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నిక

4,850 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు.. ఎన్నికల విధుల్లో 9,660 మంది సిబ్బంది

7,355 మంది పోలీసులతో బందోబస్తు..

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పల్లె పోరులో చివరి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మూడు విడతలుగా నిర్వహించ తలపెట్టిన ఎన్నికల్లో మొదటి విడత 11వ తేదీన, రెండో విడత 14వ తేదీన పూర్తి కాగా, నేడు బుధవారం చివరి విడత నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మొదటి రెండు విడతల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లను సాధించిన ఉత్సాహంలో ఉండగా, బీఆర్‌ఎస్‌ కూడా తన పట్టును నిలుపుకుంటోంది. బీజేపీ గతంలో లేని విధంగా అడపాదడపా సీట్లను సాధించుకుంటోంది. సీపీఐ, సీపీఎం, మాస్‌లైన్‌లు కూడా ఉమ్మడి జిల్లాలో పలు అంతర్గత పొత్తులతో విజయాలు నమోదు చేసుకుంటున్నాయి. ఇక చివరి దశలో ఎవరి అదృష్టం ఎలా ఉందో బుధవారం తేలనుంది. మొదటి దశ నుంచి మూడో దశ పోలింగ్‌ కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేశారు. సమయం తక్కువగా ఉండటంతో ఊర్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఓటుకు నోట్లు పంచి, మద్యం వరద పారించారు. దాంతో ఊర్లకు ఊర్లు మత్తులో మునిగాయి. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు, వివిధ పనులు, ఉద్యోగం, చదువు నిమిత్తం వెళ్లినవారు ఓట్ల పేరుతో ఊర్లకు రావడంతో వారం రోజుల నుంచి గ్రామాలు సందడి సందడిగా కనిపించాయి. బుధవారం పోలింగ్‌ పూర్తికానుండటంతో ఆ సందడి మాయం కానుంది. నిన్నటి వరకు ఓట్లు అడిగిన వారు నేటి సాయంత్రం నుంచి పట్టించుకునే పరిస్థితులు ఉండవు. మూడో విడత పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో కేటాయించిన గ్రామాలకు పోలింగ్‌ సిబ్బందిని తరలించారు.

504 పంచాయతీల్లో ఎన్నికలు..

ఉమ్మడి జిల్లాలో మూడో విడతలో మొత్తం 563 పంచాయతీలకు, 5,016 వార్డులకు ఎన్నికల నిర్వహణకు షె డ్యూల్‌ విడుదలైంది. అందులో 52 స ర్పంచు స్థానాలు, 945 వార్డులు ఏకగ్రీ వం అయ్యాయి. బుధవారం 504 పంచాయతీలకు, 4,020 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచు స్థానాలకు 1,651 మంది, వార్డు స్థానాలకు 9,918 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నేడు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పోలింగ్‌ నిర్వహణకు 4,850 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,660 సిబ్బందిని కేటాయించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించనున్నారు. సోమవారం ప్రచారం పూర్తికావడంతో మంగళవారం ప్రలోభాలకు తెరతీశారు. ఓటుకు నోటుతోపాటు మద్యం కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సర్పంచు పదవి కోసం చేస్తున్న ఖర్చును చూసి ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులు జంకుతున్నారు. ఒక్కో ఊర్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు, మేజర్‌ పంచాయతీల్లో రూ.50 లక్షల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఖర్చు చేసినా అభ్యర్థులను ఓటర్లు తిరస్కరిస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు తమ ఆవేదనను తమ సోషల్‌ ఖాతాల్లో పంచుకుంటున్నారు. కొందరు ఇచ్చిన డబ్బులను వాపస్‌ అడుగుతున్నారు. ఇక మూడో విడతలో చివరగా ఎంత ఖర్చు చేస్తారో.. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

7 జీపీలు.. 51 వార్డులకు ఎన్నికల్లేవ్‌..

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఏడు పంచాయతీలకు, 51 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. అందులో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆరు పంచాయతీలు ఉండటం విశేషం. ఈ జిల్లాలోని అమ్రాబాద్‌ మండలంలో ఉన్న బీకే లక్ష్మాపూర్‌, వంగూరోనిపల్లి, కుమ్మరోనిపల్లి, కల్మూలోనిపల్లి, ప్రశాంత్‌ కాలనీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయినా, పోలింగ్‌ మాత్రం జరగడం లేదు. గతంలో ఏజెన్సీ గ్రామాల్లో అంతర్భాగంగా ఉన్న ఈ గ్రామాలు నూతన పంచాయతీరాజ్‌ చట్టం వచ్చిన తర్వాత ప్రత్యేక పంచాయతీలను చేశారు. అయితే అవి ఏజెన్సీ నోటిఫైలో ఉండటంతో ట్రైబల్స్‌కు రిజర్వ్‌ చేశారు. కానీ ఆ ఐదు పంచాయతీల్లో ఒక్కచోట కూడా ట్రైబల్స్‌ లేరు. దీంతో ఎన్నికలు జరగడం లేదు. అలాగే ఇదే జిల్లా చారకొండ మండలం ఎర్రవెల్లిలో భూనిర్వాసితులు ఎన్నికలను బహిష్కరించారు. అక్కడ కూడా పోలింగ్‌ జరగడం లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం శంకరంపల్లి తండా ఎస్టీకి రిజర్వ్‌ చేయగా.. అక్కడ ఆ అభ్యర్థి లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో అక్కడా ఎన్నికలు జరగడం లేదు. ఈ గ్రామాల్లో ఉన్న 51 వార్డులకూ కూడా ఎన్నికలు జరగడం లేదు. కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Dec 16 , 2025 | 11:54 PM