వానాకాలం సాగు లక్ష్యం ఖరారు
ABN , Publish Date - May 27 , 2025 | 10:51 PM
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల వానాకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. పాలమూరులో 3,46,830 ఎకరాల్లో పంటలు వేస్తారని అం చనా వేయగా, నారాయణపేట జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
మహబూబ్‌నగర్‌లో 3.46 లక్షల ఎకరాల్లో.. నారాయణపేట జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో..
పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు
పాలమూరులో వరి.. ‘పేట’లో పత్తి అధికంగా సాగు
బోన్‌సతో సన్నాలు వేసేందుకు ఆసక్తి
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
పాలమూరు/నారాయణపేట, మే 27 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల వానాకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. పాలమూరులో 3,46,830 ఎకరాల్లో పంటలు వేస్తారని అం చనా వేయగా, నారాయణపేట జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు రెండు జిల్లాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి వారం రోజుల ముందే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు గత మూడు నాలుగు రోజులుగా ముసురు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రైతులు పంటలు వేసేందుకు పొలాలను దున్నించి, సిద్ధం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గత వానాకాలంలో 3,31,498 ఎకరాల్లో వివిధ పంటలు వేయగా, ఈ సారి 3,46,830 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. వర్షాలు అనుకూలిస్తే దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావొచ్చని చెబుతున్నారు. ధాన్యం సన్న రకాలపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో అధికంగా వరి సాగవుతుందని భావిస్తున్నారు. మొక్కజొన్న, పత్తితో పాటు కందులు, చిరు ధాన్యాల సాగు మరింత పెరిగి అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
అధికంగా వరి సాగు..
మొత్తం 3,46,830 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేయగా, అందులో 60 శాతం మేర అంటే 2 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. తర్వాత పత్తి 85,000 ఎకరాల్లో, మొక్కజొన్న 30,000, కందులు 10,000, జొన్నలు 18,000 ఎకరాల్లో సాగవుతాయని అంచనా రూపొం దించారు.
60 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం
జిల్లాకు 60 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం దశల వారీగా వాటిని సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, హాకా ద్వారా పంపిణీ చేయనుంది. విత్తనాలను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందించనున్నారు. 14 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. గతేడాది మొక్కజొన్న పంటకు మంచి ధర రావటంతో రైతులు ఈ సారి ఆ పంట ఎక్కువగా సాగు చేస్తారని అధికారులు భావిస్తున్నారు.
నారాయణపేట జిల్లాలో మొదలైన సాగు
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ముందస్తుగా సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని నర్వ, ఊట్కూర్, దామరగిద్ద మండలాల్లో పత్తి విత్తనాలు విత్తుతున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో 4.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అధికంగా పత్తి 1,80,000 ఎకరాల్లో సాగు చేయనుండగా, తర్వాత వరి 1,75,000, కందులు 70,000 ఎకరాల్లో సాగు చేయనున్నారు. జొన్నలు 5,000, పెసర 5,000, ఇతర పంటలు 1,000 ఎకరాల్లో సాగవుతాయని అంచనా రూపొందించారు. జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉండటంతో వర్షాధార పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పత్తి తర్వాత కందులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వర్షాలు రాకముందే పత్తి విత్తరాదు
వర్షాలు రాకముందే రైతులు పత్తి విత్తనా లు వేయరాదు. వర్షం వస్తుందనుకొని వేస్తే.. అధిక ఉష్ణోగ్రతకు విత్తనాలు భూమిలోనే కరిగిపోతాయి. తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాల్లోకి దళారులు వచ్చి లూజుగా అమ్మే విత్తనాలు కొనొద్దు. విత్తనాలు, ఎరువులు దొరుకుతాయో లేదోనని టెన్షన్ పడొద్దు. అవసరమైనన్ని పత్తి, వరి విత్తనాలు అందుబాటులో ఉంచినం. మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు. జాగ్రత్తలు తీసుకుని నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవాలి. విత్తనాలు, ఎరువులు కొన్నచోట తప్పక రశీదు తీసుకోవాలి.
- బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయ అధికారి, మహబూబ్‌నగర్