పోలీసుల వైఖరిపై నిరసన
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:06 PM
ఇరువర్గాల మధ్య 5 రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు నమోదు చేయకపోడంతో బాధిత కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.
- ఐదు రోజుల క్రితం తెల్లరాళ్లపల్లిలో ఘర్షణ
- ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆరోపణ
- పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ధర్నా
- మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
పాన్‌గల్ ,నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఇరువర్గాల మధ్య 5 రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు నమోదు చేయకపోడంతో బాధిత కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వనపర్తి జిల్లా, పాన్‌గల్ మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు బాబూనాయక్ కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలునాయక్, రాజునాయక్, భాస్కర్‌నాయక్ కుటుంబ సభ్యులు 5 రోజుల క్రితం దాడి చేశారు. సంఘటనపై బాధితులు పాన్‌గల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితులు రాజేశ్, మున్నా, రామకృష్ణ, చిరు మంగళవారం పాన్‌గల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారితో ఎస్‌ఐ దురుసుగా మాట్లాడి, సాయంత్రం వరకు అక్కడే కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న బాబూనాయక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐతో మాట్లాడగా ఆయన దుర్భాష లాడారు. రౌడీషీట్ ఓపెన్ చేస్తానని బెదిరించాడు. దీంతో అతడు కుటుంబ సభ్యులతో కలిసి స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. దీంతో మనస్తాపం చెందిన బాబునాయక్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాబు నాయక్‌ను బీఆర్‌ఎస్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, మండల అధ్యక్షుడు పెట్బేటి వీరసాగర్ పరామర్శించారు. ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఇరు వర్గాల వారు మాట్లాకుంటామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. తండాలో పోచమ్మ పండుగ ఉండడంతో మాట్లాడుకోవడంలో జాప్యం జరిగిందన్నారు. తమకు ఎవరిపై పక్షపాతం లేదని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపారు.