ఆర్టీసీకి లాభాల పంట
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:12 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది ఆర్టీసీ డిపోలకు దసరా పండుగ సందర్భంగా లాభాల పంట పండింది.
- దసరా ఆదాయం రూ. 33.65 కోట్లు
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది ఆర్టీసీ డిపోలకు దసరా పండుగ సందర్భంగా లాభాల పంట పండింది. గత నెల 20 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు 14 రోజుల్లో ఆర్టీసీ బస్సులు 53.07 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. రూ. 33.65 కోట్ల ఆదాయం లభించినట్లు ఆర్‌ఎం సంతోష్‌కుమార్ తెలిపారు. మొత్తం 63 లక్షల 20 వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించినట్లు చెప్పారు. గత సంవత్సరం కన్నా 8 లక్షల కిలోమీటర్లు ఎక్కువగా బస్సులను నడిపి, రూ. 4 కోట్ల మేర అధిక ఆదాయం సంపాదించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 104 శాతం ఓఆర్ (ఆక్యుపెన్సీ రేట్)తో మహబూబ్‌నగర్ రీజియన్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ అద్భుత విజయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ రీజియన్‌లోని ప్రతీ ఉద్యోగి కృషి ఉందని కొనియాడారు. ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లు దసరా, బతకమ్మ పండుగల సందర్భంగా వేడుకలకు దూరంగా ఉండి, విధులకు హాజరుకావడం గర్వకారణమని తెలిపారు. ఈ 14 రోజుల్లో అచ్చంపేట డిపో రూ.3.30కోట్లు, గద్వాల డిపో రూ. 3.71 కోట్లు, కల్వకుర్తి రూ. 3.72కోట్లు, కొల్లాపూర్ రూ. 2.54 కోట్లు, కోస్గి రూ. 56 లక్షలు, మహబూబ్‌నగర్ రూ. 5.24 కోట్లు, నాగర్‌కర్నూల్ రూ. 3.23కోట్లు, నారాయణపేట రూ. 3.41కోట్లు, షాద్‌నగర్ 3.36 కోట్లు, వనపర్తి రూ.4.52 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు.