Share News

ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతులు

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:15 PM

రాష్ట్రంలో ఆయా మెడికల్‌ కళాశాలలు, జనరల్‌ ఆసుపత్రులలో ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులకు ఎడీఎంఈ (అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌)లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతులు

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయా మెడికల్‌ కళాశాలలు, జనరల్‌ ఆసుపత్రులలో ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులకు ఎడీఎంఈ (అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌)లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రొఫెసర్లకు పదోన్నతులు లభించాయి. అందులో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ పదోన్నతిపై నారాయణపేట జిల్లా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెళ్లారు. అయితే ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్‌ పోస్టులో వైద్యకళాశాల డైరెక్టర్‌ ఉండడంతో ఆ పోస్టు ఖాళీ చూపించలేదు. అయితే ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరికి ఇస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఉన్నవారిలో పీడియాట్రిక్‌, రేడియాలజి, ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్లు సీనియర్లుగా ఉన్నారు. కానీ వారు ముందు నుంచే ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపమని చెప్పేశారు. ఇదిలా ఉండగా సర్జరీ విభాగాధిపతిగా ఉన్న దీన్‌ దయాల్‌ భంగ్‌కు వికారాబాద్‌ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. నారాయణపేట జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా హన్మకొండ కేఎంసీ రేడియాలజి విభాగాధిపతి డాక్టర్‌ స్వర్ణకుమారికి ఇచ్చారు. వికారాబాద్‌ ఆసుపత్రిలో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ మల్లికార్జున్‌కు వనపర్తి మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా, సూపరింటెండెంట్‌గా సంగారెడ్డి జీఎంసీలోని ఈఎన్‌టీ ప్రొఫెసర్‌ శోభన్‌బాబుకు పోస్టింగ్‌ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలోని ఓబీజీ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ సంగీతకు సిద్ధిపేట జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఇచ్చారు. కొత్తగా మంజూరైన కొడంగల్‌ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా సంగారెడ్డి ఎస్‌ఎంసీ జనరల్‌ సర్జరీ విభాగధిపతి డాక్టర్‌ రాజుకు, సూపరింటెండెంట్‌గా యాదాద్రి బోనగిరి జీఎంసీ ఓబీజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాలతికి పోస్టింగ్‌ ఇచ్చారు. జోగులాంబ గద్వాల్‌ జిల్లా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా మహేశ్వరం జీఎంసీ టీడీ, సడీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌కు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా గాంధీ మెడికల్‌ కళాశాల పీడియాట్రిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగార్జునకు పదోన్నతి కల్పించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నిజామాబాద్‌ జీఎంసీ పీడియాట్రిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉషారాణికి ఇచ్చారు.

Updated Date - Jul 08 , 2025 | 11:15 PM