భూ భారతితో సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:30 PM
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో నెలకొన్న భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలన్నింటికీ భూ భారతి చట్టంతో పరిష్కారం కానున్నాయని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.
- జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి
- కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
జడ్చర్ల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో నెలకొన్న భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలన్నింటికీ భూ భారతి చట్టంతో పరిష్కారం కానున్నాయని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కొనుగోలు చేసిన భూముల అంశంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో ఇబ్బందులకు గురయ్యానని వెల్లడించారు. ప్రస్తుతం భూ భారతి చట్టంలో దరఖాస్తు చేసుకుని, భూ సమస్యలను పరిష్కరించుకుంటానన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి ప్రతీ రోజు వచ్చే వారి సంఖ్యలో 90 శాతంకు పైగా భూ సమస్యలపైనే వస్తున్నారని, ఆ అంశాలను ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు పంపించి పరిశీలించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ విజయేందిరబోయి మాట్లాడుతూ భూ భారతి చట్టం జనవరి నెలలో చట్టం చేసినా, ఏప్రిల్ 14న అమలులోకి వచ్చిందని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కాని వాటిని సీసీఎల్‌ఏ, ల్యాండ్ ట్రిబ్యునల్‌లలో పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఆధార్ నెంబరు మాదిరిగా భూములకు సైతం భూదార్ నెంబరులు ఇవ్వనున్నట్లు, ప్రతీ మార్పు సర్వే మ్యాప్‌తో చేయబోతున్నారని వివరించారు. భూ భారతి చట్టం గురించి, అందులోని సెక్షన్‌లను భూ భారతి చట్టంలో కీలకపాత్ర పోషించిన న్యాయవాది, భూమి సునీల్ వివరించారు. భూములకు భూధార్ నెంబరులు కేటాయిస్తున్నట్లుగానే, రాబోయే రోజుల్లో ఇంటి స్థలాలకు సైతం నెంబర్లు కేటాయించనున్నారని తెలిపారు. అదనపు కలెక్టర్ మోహన్‌రావు, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, ఆర్డీవో నవీన్‌కుమార్, తహసీల్దార్ నర్సింగ్‌రావు, బాదిమి శివకుమార్, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతి పాల్గొన్నారు.