ఆదిలోనే అవాంతరాలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:23 PM
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) నిర్మాణం కొనసాగుతుండగానే అనేక లోపాలు బయటపడుతున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించక ముందే బయటపడుతున్న నాణ్యతా లోపాలు
పునరుద్ధరణ చేస్తున్నప్పటికీ తెగుతున్న ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట
గతేడాది ఆడిట్ కెనాల్ షట్టర్లు లేక మునిగిన వట్టెం మోటార్లు
2020లో కరివెన రిజర్వాయర్ వద్ద కుంగిన కట్టకు మరమ్మతులు
నీళ్లు నింపితే మరెన్ని లోపాలు బయటపడతాయోననే ఆందోళన
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) నిర్మాణం కొనసాగుతుండగానే అనేక లోపాలు బయటపడుతున్నాయి. 2023లో నార్లాపూర్ వద్ద ఒక మోటార్‌ను ఆన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పినప్పటికీ ఇంకా ప్రధాన కాలువల పనులు పూర్తి కాలేదు. తరచూ బయటపడుతున్న నాణ్యతా లోపాల కారణంగా ప్రాజెక్టు భద్రతపై ఆందోళన కలుగుతోంది. దీనికంటే ముందు రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, సుందిళ్ల, అన్నారంలో బుంగలు పడటంతో దాని భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకోగా, పునరుద్ధరించేందుకు ప్రభుత్వం డిజైన్లను ఆహ్వానించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఇదే విషయంపై పాలమూరు- రంగారెడ్డి పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- మహబూబ్‌నగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోక ముందే లోపాలు వెలుగు చూస్తున్నాయి. 2020 నుంచి ఎక్కడో ఒకచోట నాణ్యతాలోపం బయటపడుతూనే ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు అంత వేగంగా నడవడం లేదు. కానీ, లోపాలపై దృష్టిపెట్టి పకడ్బందీగా నిర్మాణ పనులు చేపట్టకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి మాత్రం కచ్చితంగా ఉన్నదని చెప్పవచ్చు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం కరివెన వద్ద కురుమూర్తిరాయ రిజర్వాయర్‌ను 19 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. దీనిద్వారా 1.51 లక్షల ఎకరాలకు నీరిందించాలనేది లక్ష్యం. మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేపట్టగా 13వ ప్యాకేజీ వద్ద 2020 ఆగస్టు 19వ తేదీన కురిసిన వర్షానికి కట్ట కుంగిపోయింది. అప్పట్లో ప్రస్తుత దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ కాంగ్రెస్ నాయకులతో ధర్నా నిర్వహించి రాష్ట్రస్థాయి సమస్యగా లేవనెత్తారు. తర్వాత కట్టకు మరమ్మతు చేశారు. ప్రస్తుతం ఈ కట్ట వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ 19 టీఎంసీలు పూర్తిస్థాయిలో నింపేనాటికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
వరదలో మునిగిన వట్టెం మోటార్లు
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల్లో మూడో రిజర్వాయర్ అయిన వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్‌ను 16.74 టీఎంసీల సామర్థ్యంతో 1.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిరందించే ఉద్దేశంతో చేపట్టారు. దీనికి ముందు ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి ఓపెన్ కెనాల్, టన్నెల్ ద్వారా 24.575 కిలోమీటర్లు ప్రయాణించి నీరు వట్టెం పంప్‌హౌజ్‌కు చేరుకుంటుంది. ఇక్కడి 121 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లి వట్టెం రిజర్వాయర్‌లో వదలాలి. మొత్తం 10 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అప్పటికే నాలుగు మోటార్లు సిద్ధం చేశారు. గతేడాది సెప్టెంబరులో కురిసిన వర్షాలకు నాగర్‌కర్నూలు జిల్లా శ్రీపురం వద్ద ఏర్పాటు చేసిన ఆడిట్ టన్నెల్‌లోకి పైన ఉన్న చెరువు కట్ట తెగిపోయి నీళ్లు చేరింది. అక్కడ నుంచి ప్రధాన మార్గం, సర్జ్‌పూల్, పంపుహౌజ్‌లలో వరద చేరి మోటార్లు నీటమునిగాయి. దీనికి కారణం ఆడిట్ టన్నెల్‌లోకి నీరు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, కనీసం వరదను నిరోధించేలా షట్టర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయకపోవడమే కారణంగా చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత రాళ్లు, మట్టితో ఆడిట్ టన్నెల్‌లోకి నీరు రాకుండా అడ్డుకట్ట వేశారు. బురద నీటిని ఎత్తిపోయించి ప్రస్తుతం నాలుగు మోటార్లను పునరుద్ధరించి డ్రైరన్ చేసినట్లు ఈఈ పార్థసారథి తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టమైంది.
ఉదండాపూర్ కట్ట కోత...
ఉదండాపూర్ రిజర్వాయర్ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చాలా కీలకమైన రిజర్వాయర్. మొత్తం 16.03 టీఎంసీల సామర్థ్యంతో 5.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని చేపట్టారు. దీని తర్వాత డిజైన్ చేసిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ రద్దు కావడంతో దాని పరిధిలోని 4.13 లక్షల ఎకరాలకు కూడా ఉదండాపూర్ ద్వారా నీరు వెళ్లాల్సిందే. అయితే ఇంత కీలకమైన రిజర్వాయర్ కట్ట నిర్మాణంలో నాణ్యతాలోపాలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది రెండుసార్లు కట్ట కోతకు గురైంది. సెప్టెంబరులో ఓసారి కోతకు గురైతే మరమ్మతులు చేయగా అక్టోబరులో మరోమారు కోతకు గురైంది. సుమారు 20 ఫీట్ల మేర గోతులు ఏర్పడ్డాయి. నాసిరకం మట్టిని వాడటం, అందులో ఉన్న రాళ్లను తీయకుండా రోలింగ్ చేయడంతో పాటు రివిట్‌మెంట్ సరిగా లేకపోవడంతో కట్ట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పొలాల్లోకి మట్టి కొట్టుకువచ్చి మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కట్ట నుంచి నీరు లీకవుతుండటంతో వర్షాలతో నీరు పొలాల్లోకి చేరుతోంది. కాంట్రాక్టర్లు గతంలో లీకైన నీరు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కట్ట కింది భాగంలో పొలాల వెంట జేసీబీలతో ఐదు ఫీట్ల వెడల్పుతో కందకాలు తవ్వించి నీటిని మళ్లించారు. ఈ క్రమంలో పొలాల్లోకి వెళ్లడానికి రైతులు ఇబ్బందులు పడుతుండగా కట్ట కోతకు గురికావడంతో ఆ కందకాలు కూడా నిండిపోయి వచ్చిన నీటితో పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి లోపాలపై ఇప్పుడే దృష్టి పెడితే ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం దెబ్బతినదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.