Share News

ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:29 PM

రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్‌ విజయేందిర బోయి పేర్కొన్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

భూత్పూర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్‌ విజయేందిర బోయి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తాటిపర్తిలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు. అదే గ్రామానికి చెందిన మహిళా రైతు మంజుల ఐదెకరాల్లో సాగు చేసిన ఆయిల్‌పామ్‌ తోటను పరిశీలించి, మాట్లాడారు. ఇప్పటి వరకు 29 మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌ పామ్‌ గెలలను కోసి విక్రయించగా, రూ.4.32 లక్షల ఆదాయం వచ్చిందని మహిళా రైతు కలెక్టర్‌కు వివరించారు. ఈ ఆయిల్‌ గెలలను ఫ్రీయూనిట్‌ కంపెని వారు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసి సత్వరమే డబ్బులు అందిస్తారని కలెక్టర్‌ అన్నారు. అక్కడికి వచ్చిన హస్నాపూర్‌ గ్రామానికి చెందిన ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేస్తున్న రైతులు శేఖర్‌రెడ్డి, నర్సిహ్మారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలెక్టర్‌ మాట్లాడారు. అదే గ్రామానికి చెందిన రైతు ఎగ్గని నర్సిములు 25 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నట్లుగా కలెక్టర్‌కు వివరించారు. అక్కడి నుంచి కొత్తమొలర్గ గ్రామ శివారులో రైతు చింతకాయల రాములు తోటను కలెక్టర్‌ సందర్శించారు. ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేయడానికి ప్రభుత్వం రూ.50 వేలు అందించడం జరుగుతుందన్నారు. 4 సంవత్సరాల పాటు మొక్కల పెంపకానికి రూ.11 వేలు, డ్రిపు పరికాలకు రూ.21 వేలు, మేయిటెన్స్‌ కోసం ఎకరాకు రూ.16.800 అందిస్తుందని కలెక్టర్‌ రైతులకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 4298 ఎకరాల్లో రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా 39 మంది రైతులు 255 ఎకరాల్లో దాదాపు 500 మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌ పామ్‌ గెలలు ఉత్పత్తి అయినట్లుగా జిల్లా ఉద్యాన శాఖ అధికారులు వేణుగోపాల్‌, అనిల్‌కుమార్‌ వివరించారు. అధికారులు స్వప్న, ప్రీయూనిట్‌ ఆయిల్‌ పామ్‌ కంపెని జోనల్‌ మేనేజర్‌ రాకేష్‌, జిల్లా మేనేజర్‌ బాలరాజు పాల్గొన్నారు.

ఉదండాపూర్‌ నిర్వాసితులకు వసతులు కల్పించాలి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించే ప్లాట్లలో వసతులు కల్పించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌, మిషన్‌భగీరథ, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఉందడాపూర్‌ రిజర్వాయర్‌ కింద వల్లూర్‌, తుమ్మకుంటతండా, రేగడిగడ్డతండా, చిన్నగుంటతండా, శానుతండా, ఒంటిగుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుంటుంబాలకు, అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద 300 గజాల స్థలం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్‌, కమ్యూనిటీ హాల్స్‌, గ్రామ పంచాయతీ భవనం, పార్కులను, రోడ్లను, డ్రైనేజీలు, విద్యుత్‌, ఓవర్‌ హెడ్‌ట్యాంక్‌, మిషన్‌భగీరథ ఫైపులు వంటి మౌలిక వసతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, ఆర్డీవో నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:29 PM