Share News

కష్టపడిన వారికే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం

ABN , Publish Date - May 17 , 2025 | 11:08 PM

పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించడంతో పాటు గెలిపించుకుంటానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వెల్లడించారు.

కష్టపడిన వారికే స్థానిక  ఎన్నికల్లో ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, మే 17 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించడంతో పాటు గెలిపించుకుంటానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వెల్లడించారు. జడ్చర్ల పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో శనివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో 32వేల మంది రైతులకు రుణమాఫీ అయ్యిందని, కేవలం మూడు వేల మందికి కాలేదన్నారు. ఒకే కుటుంబంలో భార్య, భర్తలిద్దరూ రుణం కలిగి ఉండడం, ఉద్యోగులు ఉండడం తదితర కారణాలతో అందలేదని వివరించారు. ముఖ్యఅతిథిగా హజరైన పీసీసీ ఉపాధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి సాంబయ్య మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్దపీట వేస్తుందని పార్టీ అధిష్ఠానం వెల్లడించిందన్నారు. మండల అధ్యక్ష పదవికి దరఖాస్తుకు వారం రోజుల గడువు ఉందని, మండల స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, నవాబ్‌పేట, మిడ్జిల్‌, ఊర్కొండ మండలాల నుంచి దాదాపు 50 మంది మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం చేసుకున్న దరఖాస్తులను స్వీకరించారు.

Updated Date - May 17 , 2025 | 11:08 PM